షార్జా వేదికగా మంగళవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 టోర్నీ 56వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ముంబై విసిరిన 150 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ అలవోకగా ఛేదించింది. ఈ క్రమంలో ముంబైపై హైదరాబాద్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముంబై బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్ అందరూ విఫలమయ్యారు. చివర్లో పొల్లార్డ్ మెరుపులతో ముంబై గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. మొత్తం 25 బంతులు ఆడిన పొల్లార్డ్ 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 పరుగులు చేశాడు. 29 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేసిన సూర్య కుమార్ యాదవ్ ఫర్వాలేదనిపించాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ 3 వికెట్లు పడగొట్టాడు. జేసన్ హోల్డర్, ఎస్ నదీంలకు చెరో 2 వికెట్లు దక్కాయి. రషీద్ ఖాన్ 1 వికెట్ తీశాడు.
అనంతరం బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ 17.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. వికెట్ నష్టపోకుండా 151 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్లిద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వార్నర్ 58 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌తో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాట్స్‌మెన్ సాహా 45 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా ఈ విజయంతో హైదరాబాద్.. ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆ జట్టు ఈ నెల 6వ తేదీన అబుధాబిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.