పంజాబ్ రాష్ట్రంలో గత వారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా భద్రతా వైఫల్యంపై దర్యాప్తు కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్ర నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు కమిటీని బుధవారం సుప్రీంకోర్టు నియమించింది. పాకిస్తాన్ సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలోని హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్తూపం వద్దకు వెళ్తుండగా ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ 15 నుంచి 20 నిమిషాలపాటు ఫై ఓవర్‌పై ఇరుక్కుపోయిన సంఘటనలో భద్రతా ఉల్లంఘనలకు కారణాలను కమిటీ పరిశీలించనున్నది.
స్వతంత్ర కమిటీ జస్టిస్ ఇందూ మల్హోత్రా చైర్‌పర్సన్‌గా వ్యవహరించనుండగా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, చండీగఢ్ డీజీపీ, పంజాబ్ అదనపు డీజీ (భద్రత), పంజాబ్ హర్యానా కోర్టు రిజిస్టర్ జనరల్ సభ్యులుగా వ్యవహరించనున్నారు.
ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై విచారించడంతోపాటు భవిష్యత్తులో వీవీఐపీల భద్రతా ఉల్లంఘనలను నిరోధించడానికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ సిఫారసులు చేస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ ఇందు మల్హోత్రాకు ప్రధాని పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై పత్రాలను సమర్పించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది.