సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌కు తోటి జడ్జిలు, న్యాయవాదులు వీడ్కోలు పలకనున్నారు. నవంబర్ 8న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. రేపు గురునానక్ జయంతి సందర్భంగా కోర్టుకు సెలవు దినం కావడంతో ఈరోజే జస్టిస్ యు.యు. లలిత్‌కు ఆఖరి పనిదినం అవుతోంది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు 49వ సీజేఐకి నేడు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. సీజేఐ జస్టిస్ లలిత్ చివరి విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. సుప్రీంకోర్టు వెబ్‌క్యాస్ట్ ఛానల్‌తో పాటు యూట్యూబ్ ఛానల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు లైవ్ టెలికాస్ట్ ప్రారంభం కానుంది.
దేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యు.యు. లలిత్ ఆగస్టు నెలలో బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 8న ఆయన పదవీకాలం ముగియనుంది. 74 రోజులపాటు అత్యున్నత పదవిలో కొనసాగిన సీజేఐకి నేడు సుప్రీంకోర్టు వీడ్కోలు పలకనుంది. సుప్రీం కోర్టు తదుపతి ప్రధాన న్యాయమూర్తిగా డీవై చంద్రచూడ్ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరిస్తారు. 2024 నవంబర్ 10 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.