మోడీ.. కేసీఆర్‌ ను మరో కేజ్రీవాల్.. చేయనున్నారా..?

-

కేజ్రీవాల్.. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండానే సొంతంగా పార్టీ పెట్టి ఢిల్లీ పీఠం ఎక్కిన మాజీ బ్యూరోక్రాట్.. మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 67 గెలుచుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యాడు కేజ్రీవాల్. అయితే అంతటి ప్రజాదరణ ఉన్నా.. తనకు ఢిల్లీ పై సర్వ హక్కులు, పాలనాధికారాలు లేవు. ఢిల్లీ పరిధిలోని అనేక అధికారాలు కేంద్రానికే ఉన్నాయి. ప్రత్యేకించి శాంతి భద్రతల అంశం కేంద్రం పరిధిలో ఉంది.

దీని కారణంగా పాపం.. కేజ్రీవాల్ సీఎం అయినా కొన్ని విషయాల్లో మాత్రం నిమిత్తమాత్రుడే. ఈ అంశంపై ఆయన చాలా కాలంగా పోరాడుతున్నారు కూడా. అయితే ఇప్పుడు అదే పరిస్థితి కేసీఆర్ కూ రాబోతోందా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం కావడం వల్లే కేజ్రీవాల్ కు చిక్కులు వస్తున్నాయి. అదే పరిస్థితి కేసీఆర్ కూ ఎదురుకావచ్చు అంటున్నారు కొందరు విశ్లేషకులు.

ఈ మేరకు సుప్రీం కోర్ట్ న్యాయవాది కునుకు రవి శంకర్ ఆరోపణలు ఆసక్తి రేపుతున్నాయి. కేసీఆర్ ను మరో కేజ్రీవాల్ ను చేయడానికి భాజపా యత్నిస్తోందని ఆయన అంటున్నారు. విజయవాడలో సుప్రీం కోర్టు బెంచ్ దక్షిణాది రాష్ట్రాల్లో పెట్టాలని కోరుతూ మీడియా సమావేశం నిర్వహించారు . గతంలో సుప్రీం కోర్ట్ బెంచ్ బెంగళూర్ లో కానీ , హైద్రాబాద్ లో పెట్టాలని ఉద్యమాలు చేసినా ససేమిరా అన్నవారే నేడు హైద్రాబాద్ ను రెండో రాజధాని చేద్దాం అని మాట్లాడుతున్నారని ఆయన అంటున్నారు.

హైదరాబాద్ ను దేశ రెండో రాజధానిగా ప్రకటిస్తే.. రాజధాని ప్రాంతం కావడం వల్ల హైదరాబాద్ కూడా కేంద్రం పాలన కిందకు వెళ్తుందన్నది రవిశంకర్ వంటి వారి వాదన. అదే జరిగితే కేసీఆర్ మరో కేజ్రీవాల్ కావడం ఖాయం. ఎందుకంటే హైదరాబాద్ అన్నది తెలంగాణ గుండెకాయ వంటిది. హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించుకోలేం. మరి కేంద్రం అంతటి సాహసం చేస్తుందా అన్నది చూడాలి. ఇటీవలే మాజీ గవర్నర్ విద్యాసాగర్ కూడా హైదరాబాద్ ను రెండో కేపిటల్ చేయాలని కోరిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version