రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీలు తీవ్రమైన అంశమని సుప్రీం కోర్టు గుర్తించింది. దీనిపై చర్చ జరగాల్సిందేనని అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం లేదని సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ప్రశ్నించింది. ఉచితాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయబోతున్నాయని తెలిపింది. రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం వచ్చేంత వరకు ఉచిత వాగ్దానాలు ఆగబోవని స్పష్టం చేసింది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచితాలను వ్యతిరేకిస్తూ.. దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాలు తీవ్రమైన అంశమని..అందులో ఎలాంటి సందేహం లేదన్న ధర్మాసనం తెలిపింది.
కేంద్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించింది. పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది వికాస్‌సింగ్.. ఉచితాలపై ఏర్పాటు చేసే కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చైర్మన్‌గా.. ఉండాలని కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ.. పదవీ విరమణ చేసిన వ్యక్తికి.. పదవీ విరమణ చేయబోయే వ్యక్తికి ఈ దేశంలో విలువ ఉండదని అదే సమస్యని వ్యాఖ్యానించారు.