కొవిడ్-19 సెకండ్ వేవ్ సమయంలో పెద్ద ఎత్తున మెడిసిన్స్ నిల్వ చేసిన కేసులో మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌పై విచారణ నిలుపుదల చేయడం సాధ్యం కాదని సోమవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రజలు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంత మంది మెడిసిన్స్ పంపిణీ చేయడం అనుమతించ లేమని పేర్కొంది. ఈ విషయమై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని, తాము ఎలాంటి ఉపశమన ఉత్తర్వులు జారీ చేయడం లేదని తెలిపింది.
మెడిసిన్స్ లభించక అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ట్రస్టు లేదా కొంత మందిని మందుల పంపిణీకి అనుమతించలేం. ఒక వ్యక్తి మెడిసిన్స్ పంపిణీ చేయలేడు. అలాగైతే ప్రతి ఒక్కరూ తమ స్వప్రయోజనాల కోసం మందులు సేకరించి పంపిణీ చేస్తారు అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొన్నది.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని గౌతమ్ గంభీర్ న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.