ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో కడప నగరపాలక కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేసిన మునికుమార్ మూడు నెలల కిందటే డిప్యూటేషన్‌పై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. కడప రైల్వే గేటు వద్ద ట్రైను పట్టాలపై విగతజీవిగా కనిపించాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునికుమార్ ఇటీవల వ్యక్తిగత పనుల నిమిత్తం పుట్టపర్తి నుంచి కడపకు వెళ్లాడని పేర్కొన్నారు. కడప శివారులోని రాయచోటి రైల్వేగేటు వద్ద రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కాగా గతంలో పుట్టపర్తి మున్సిపల్ వైఎస్సార్ సీపీ కో-ఆప్షన్ మెంబర్ ఆదం అహ్మద్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి.. పుట్టపర్తి ప్రశాంతి రైల్వేస్టేషన్ దగ్గర్లోని రైలు పట్టాల కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన కూడా ఎన్నికైన మూడు నెలలకే ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. అయితే వీరిద్దరి ఆత్మహత్యలకు ఏమైనా కారణాలు ఉండొచ్చా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.