టాలీవుడ్లో తాను ఎప్పటికీ మెగా స్టార్‌నే అని చిరంజీవి మరోసారి రుజువు చేస్తున్నాడు. పదేళ్ల విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చి రు.100 కోట్ల షేర్‌తో తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. ఇక ఇప్పుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే చారిత్రక కథాంశంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
చిరు కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏకంగా తెరకెక్కిన ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రు.100 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతోంది. అన్ని ఏరియాల్లోను బాహుబలి సినిమాకు ధీటుగా వసూళ్లు రాబట్టిన సైరా కేవలం సింగిల్ థియేటర్లో కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించి అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
అది కూడా కేవలం 10 రోజులకే ఈ రికార్డు వసూళ్లు రాబట్టడం విశేషం. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సైరా ఆడుతున్న సుదర్శన్ థియేటర్లో పదో రోజు గ్రాస్ రూ.కోటి మార్కును దాటింది. ఇక్కడ సైరా సినిమాను మొత్తం నాలుగు థియేటర్లలో వేశారు. రెండో వారంలో కూడా రెండు థియేటర్లలో ఆడింది. ఇంత జరిగినా కూడా అక్కడ సింగిల్ థియేటర్లో రు.కోటి గ్రాస్ అంటూ మామూలు విషయం కాదు.
రంగస్థలం ఇదే సుదర్శన్ థియేటర్లో పుల్ రన్‌లో రూ.2.4 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమా జై లవకుశ సింగిల్ థియేటర్లో రు.కోటి గ్రాస్ రాబట్టింది. ఇటీవల వచ్చిన ప్రభాస్ సాహో 1.4 కోట్లు రాబడితే, బాహుబలి రెండు భాగాలు సింగిల్ థియేటర్లో రు.2 కోట్లు కొల్లగొట్టాయి.