“నాకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా నాకున్న సీనియార్టీ లేదు“-అంటూ గతంలో సీఎంగా ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ అందరి చెవుల్లోనూ మార్మోగుతున్నాయి. అయితే, ఆయన ఆ మాటలకు ఎంతమేరకు కట్టుబడ్డారు? ఏమేరకు పార్టీని ముందుకు నడిపించగలుగుతున్నారు ? అనేవి మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. తనకున్న అనుభవం మరెవరికీ లేదని చెబుతూనే.. ఒంటరిగా పార్టీని నడిపించేందుకు గింగిరాలు తిరిగిపోతున్నారు.
పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసింది ఇటీవల జరిగిన ఎన్నికల్లోనే. అయితే, ఈ ఎన్నికల్లో ఆయన విజయం కోసం ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా.. ప్రజలు పట్టించుకోలేదు. ముఖ్యంగా ఆయన మాటలకు, చేతలకు పొంతన లేకపోవడం, అడుగడుగునా మాటలు మార్చడం, వాడుకునే వదిలేసే నైజాన్ని ఒంటబట్టించుకోవడం, అవసరం తీరాక.. తూ.. నాబొడ్డు! అనే బాపతుగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
రాజకీయాల్లో ఒక్కసారి వచ్చిన మచ్చ పోయేందుకు చాలా కష్టం. అలాంటిది మచ్చలపై మచ్చలు వేసుకున్న చంద్రబాబుకు ఇప్పుడు గడ్డు పరిస్థితి మరింత ఎక్కువ అవుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనేది వాస్తవమే. అయితే, ఏ ఎండకు ఆ గొడుగు పడతామంటే.. నేటి జనరేషన్ ఒప్పుకొంటుందా? అనేది కూడా చంద్రబాబు ఆలోచించుకోలేక పోతున్నారు. గతంలో అయితే, ప్రజలకు కొన్ని పత్రికలు మాత్రమే అందుబాటులో ఉండేవి. వాటిలో రాయించుకునే/ రాసే వార్తలే.. ప్రామాణికంగా ఉండేవి. కానీ, నేటి సోషల్ మీడియా ప్రపంచంలో ఏనాయకుడు ఏం చేస్తున్నాడు? ఏనాయకుడు ఏం మాట్లాడుతున్నాడు? అనే విషయాలు ప్రజలకు క్షణాల్లో లైవ్‌ల రూపంలో చేరిపోతున్నాయి.
ఈ క్రమంలోనే చంద్రబాబు అటు ప్రత్యేక హోదా నుంచి ఇటు పార్టీ వరకు కూడా చేసిన వ్యాఖ్యలు , చేస్తున్న వ్యాఖ్యలు కూడా ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. బీజేపీ విషయంలో తాను తప్పు చేశానని తాజాగా విశాఖ పర్చటనలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంటే.. ఇటీవల ఎన్నికలకు ముందు బీజేపీతో విభేదించానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, ఫక్తు రాజకీయ లాభాపేక్ష లేకుండా చంద్రబాబు ఎలాంటి అడుగులు వేయరనే విషయం తెలిసిందే. పసుపు-కుంకుమ తనను నిలబెడుతుందని ఆయన ఆశపడ్డారు. అదేసమయంలో జగన్‌ను దోషిగా నిలబెట్టి.. పబ్బం గడుపుకుందామని అనుకున్నారు.
అయితే, చంద్రబాబు మెరమెచ్చు మాటలకు జనం డీలా పడలేదు. పైగా గట్టి షాక్ ఇచ్చారు. ఇక, ఇప్పుడు మళ్లీ అదే బీజేపీతో నాలుగు మాసాలు కూడా కాకుండానే పొత్తుకు రెడీ అనే సంకేతాలు ఇచ్చారు. వాస్తవానికి పార్టీ ప్రారంభించి 38 ఏళ్లు పూర్తయ్యాయి. తనకు 40 ఏళ్ల సీనియార్టీ ఉందని చెప్పుకొనే నాయకుడు పార్టీని ఒంటరిగా ముందుకు నడిపించే సత్తా లేకపోవడం, పొత్తుల కోసం వెంపర్లాడడం వంటివి మేధావుల నుంచి సామాన్యుల వరకు అందరినీ కలచి వేస్తున్న పరిణామాలు.