ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో టీటీడీపీ చీఫ్..ప్యూహం అదేనా

-

టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ వచ్చే నెలలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగేందుకు ప్లాన్ చేస్తున్నారట. గత ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుల నేపథ్యంలో తన సీటునే త్యాగం చేసిన టీ టీడీపీ చీఫ్ ..ఈసారి పెద్దల సభకు పోటీ పడేందుకు సిద్దం అవుతున్నారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వెనుక పెద్ద ప్యూహమే ఉన్నట్లు తెలుస్తుంది.

ఎల్ రమణ తెలంగాణా రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేదు. రాజకీయాల్లో యువనాయకుడుగా ఎంటరై తెలుగు దేశం పార్టీలో కీలక పదవి వరకు ఎదిగారు. ఇప్పుడు తెలంగాణా టీడీపీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏమీ బాగలేదు. బలమైన నేతలంతా ఇతర పార్టీలకు వలసవెళ్లారు. ఉన్న కొద్దిమంది నేతల్ని కాపాడుకుంటూ.. ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చలాయించిన టీడీపీ పార్టీ ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఉనికే ప్రశ్నార్ధకంగా మారుతోంది.

టీ టీడీపీలోని చాలా మంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. సెటిలయ్యారు కూడా.. అయితే పార్టీని నమ్ముకున్న వాళ్లు పోటీ చేసినా గెలవలేక.. గెలిచినా పార్టీలో ఉండలేక అన్నట్లుగా తయారయింది పరిస్థితి. మొత్తానికి ఈసారి పార్టీ అధ్యక్షుడు.. ఒక అడుగు ముందుకు వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడేందుకు రెడీ అవుతున్నారు.. ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతాయి. అభ్యర్థి పేరుతో జరిగే ఈ ఎన్నికలు కాబట్టి.. ఇది తనకు కలిసొచ్చే అంశమని రమణ భావిస్తున్నారట.

గత ఎన్నికల్లో పొత్తుల కారణంగా ఆయన సొంత నియోజకవర్గం జగిత్యాలను కాంగ్రెస్ కు ఇచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ – రంగారెడ్డి- మహాబూబ్ నగర్‌ పట్టభధ్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచి.. నిస్తేజంలో ఉన్న పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకురావాలనుకుంటున్నారా అని తెలంగాణ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version