చైనాలో ఓ వైపు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంటే మరో వైపు భారత్‌లో మాత్రం ఈ వైరస్ ప్రజలను వణికిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 131కి పైగా కరోనా కేసులు నమోదు కాగా ఒక్క మహారాష్ట్రలోనే 37 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా నేపథ్యంలో ఆగ్రాలోని తాజ్‌మహల్ సందర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజ్‌మహహల్‌తోపాటు ఢిల్లీలోని కుతుబ్ మీనార్, ఎర్రకోటలను కూడా మూసివేశారు. అలాగే ఇతర అన్ని చారిత్రక కట్టడాలు, ప్రదర్శన శాలలు, మ్యూజియంలను కూడా మార్చి 31వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో అన్ని ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు.
కాగా భారత ప్రభుత్వం.. టర్కీ, బ్రిటన్ తదితర దేశాల నుంచి వచ్చే పర్యాటకుల ప్రవేశాన్ని కూడా బుధవారం నుంచి నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అటు ప్రధాని మోదీ కూడా ఇప్పటికే కరోనాపై పోరాటం చేద్దామని, ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చారు.