తక్కువ మొత్తంలో నీటిని తాగడం, స్థూలకాయం, డయాబెటిస్, జీర్ణ సమస్యలు ఉండడం, అధికంగా మాంసాహారం తీసుకోవడం… వంటి అనేక కారణాల వల్ల కొందరికి మలబద్దకం సమస్య వస్తుంటుంది. దానికి వెంటనే స్పందించాలి. లేదంటే పరిస్థితి మరింత తీవ్రతరమై సమస్య ఇంకా ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే కింద తెలిపిన ఆహారాలను నిత్యం తింటుంటే మలబద్దకం సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
* జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను పైనాపిల్ జ్యూస్ నియంత్రిస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు పోతాయి. పైనాపిల్‌లో ఉండే బ్రొమెలెయిన్ అనే సమ్మేళనం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గుతుంది.
* అరటి పండ్లలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కనుక దీన్ని తరచూ తింటుంటే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.
* రోజుకు తగినంత నీటిని తాగకపోయినా మలబద్దకం సమస్య ఏర్పడుతుంది. కనుక నీటిని తగినంత తాగాలి.
* నిత్యం కొబ్బరినూనెను ఏదో ఒక రకంగా తీసుకుంటుంటే మలబద్దకం సమస్య నుంచి త్వరగా బయట పడవచ్చు.
* ద్రాక్షలు కూడా జీర్ణ సమస్యలను పరిష్కరించేందుకు చక్కగా పనికొస్తాయి. తరచూ వీటిని తీసుకోవడం ద్వారా మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు.
* నిమ్మరసం తాగడం వల్ల జీర్ణాశయం, పేగుల్లో ఉండే వ్యర్థ, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అలాగే మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
* బొప్పాయి పండును తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మలబద్దకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం సమస్యలు తగ్గుతాయి.