సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్‌కు చెందిన ఐఫోన్ 11 ఫోన్లను మీరు వాడుతున్నారా ? అయితే ఈ వార్త మీకోసమే. ఎందుకంటే.. ఆ ఫోన్లలో డిస్‌ప్లే పరంగా సమస్యలు వస్తున్నాయి. టచ్ సరిగ్గా పనిచేయడం లేదు. పలువురు యూజర్లు యాపిల్‌కు ఫిర్యాదు చేయగా.. దీనిపై ఆ సంస్థ స్పందించింది. ఈ క్రమంలోనే టచ్ సరిగ్గా పనిచేయని డిస్‌ప్లేలను యాపిల్ ఉచితంగా మార్చి ఇస్తోంది.
అయితే 2019 నవంబర్ నెల నుంచి 2020 మే నెల మధ్య తయారైన ఐఫోన్ 11 ఫోన్లలో మాత్రమే ఈ సమస్య వస్తుందని నిర్దారించారు. డిస్‌ప్లే టచ్ సరిగ్గా పనిచేయడం లేదని వినియోదారులు ఫిర్యాదు చేశారు. దీంతో యాపిల్ వారికి ఉచితంగా డిస్‌ప్లేను మార్చి ఇస్తోంది. అయితే ఎవరైనా ఐఫోన్ 11 ఫోన్ల యూజర్లు తమకు ఈ సమస్య వస్తుందని భావిస్తే వారు యాపిల్ సైట్‌లోకి వెళ్లి తాము ఈ ఆఫర్‌కు అర్హులా, కాదా.. అన్న విషయాన్ని చెక్ చేసుకోవచ్చు. అర్హులైతే యూజర్లు తమకు సమీపంలోని యాపిల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌లో డిస్‌ప్లేలను ఉచితంగా మార్చుకోవచ్చు.
ఇక టచ్ సమస్య ఉన్నప్పటికీ డిస్‌ప్లేకు ఏమైనా పగుళ్లు ఉంటే అలాంటి యూజర్లు కొంత మొత్తంలో రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ను అందుకోవాలంటే యూజర్ల ఐఫోన్ 11 ఫోన్ల డిస్ ప్లేలు పగిలి ఉండరాదు. ఇక కేవలం ఐఫోన్ 11 ఫోన్లకు మాత్రమే యాపిల్ ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఐఫోన్ 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్ ఫోన్లకు సమస్య లేదు, కనుక ఆ యూజర్లు ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.