క్యాన్సర్ వ్యాధిని జయించడంలో సైంటిస్టులు ఒక అద్భుతమైన మార్గాన్ని కనుగొన్నారు. తలనొప్పితోపాటు హార్ట్ ఎటాక్‌లు, గుండె జబ్బుల బారిన పడిన వారికి ఇచ్చే యాస్పిరిన్ Aspirinను వాడడం వల్ల క్యాన్సర్ రోగులు మృతి చెందే అవకాశాలు తగ్గుతాయని తేల్చారు. సైంటిస్టులు ఓ అధ్యయనం ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.
కార్డిఫ్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న 2.50 లక్షల మంది వివరాలను సేకరించారు. వారు ఏ మందులను వాడుతున్నది పరిశీలించారు. దీంతోపాటు 18 రకాల క్యాన్సర్లకు చెందిన 118 అధ్యయనాలను వారు పరిశాలించారు. దీంతో తేలిందేమిటంటే.. క్యాన్సర్ బారిన పడినవారు యాస్పిరిన్‌ను వాడడం వల్ల వారు చనిపోయే అవకాశాలు 20 శాతం వరకు తగ్గుతాయని తేల్చారు.
సైంటిస్టులు చేపట్టిన ఈ అధ్యయనం తాలూకు వివరాలను క్యాన్సర్ మెడికల్ సైన్స్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. యాస్పిరిన్ తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ ఇతర భాగాలకు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవచ్చని, అలాగే అనారోగ్యం తీవ్రత తగ్గుతుందని, మరణించే అవకాశాలు 20 శాతం వరకు తగ్గుతాయని తేల్చారు.
సాధారణంగా ఏ రకం క్యాన్సర్ బారిన పడినా వ్యాధి బాగా ముదిరితే వైద్యులు కూడా ఏమీ చేయలేరు. కానీ యాస్పిరిన్ వల్ల వారు మరణించే అవకాశాలను, ఇన్‌ఫెక్షన్ తీవ్రతను తగ్గించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే దీనిపై మరిన్ని అధ్యయనాలు చేస్తామని వారు చెబుతున్నారు.