విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆ రోజు మాట్లాడిన నాయకులు ఇప్పుడు మాట్లాడడం లేదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న పరిస్థితులు వేరు. కేంద్రం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండానే ఓ రాయి విసిరింది. ప్రయివేటీకరణకు సై అంటోంది. ఆ విధంగా ఆస్తులు ఎన్ని ఉన్నా పట్టించుకోకుండా కేవలం కొందరి రాజకీయ లబ్ధి కోసం బీజేపీ సర్కారు అడుగులుం ముందుకు వేస్తోంది. అయితే ఈ పాపంలో కొందరి పెద్దల హస్తం ఉంది.
అందుకు టీడీపీ కానీ వైసీపీ కానీ అతీతం కాదు. ఆ రెండు కుటుంబ పార్టీలే విశాఖ స్టీల్ అమ్మకానికి సహకరిస్తున్నాయి అన్నది కూడా ఓ ఆరోపణ వామ పక్ష భావజాలం నుంచి వినిపిస్తోంది. ఏదేమయినప్పటికీ ఆదాయం దండీ ఉన్నా, ఇప్పుడిప్పుడే లాభాలు అందిస్తున్నా, కరోనా వేళ దేశ వ్యాప్తంగా ఉన్న అవసరతల రీత్యా ఆక్సిజన్ బెడ్ల రూపకల్పన చేసి అందించినా అవేవీ కేంద్రాన్ని కదిలించడం లేదు. ప్రభావితం చేయడం లేదు. అందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం అన్నది ఇప్పుడు చాలా సులువు అయిన పని! మరి! కొనుగోలు ? ఈ పనేదో టాటా కంపెనీతోనే చేయించవచ్చు కదా!
వాస్తవానికి టాటాలు అనుకుంటే ఏమయినా కొనుగోలు చేయగలరు. ఆ విధంగా ఎయిర్ లైన్స్ ను తమ పరం చేసుకుని మంచి లాభాల బాటలో ఉండేందుకు అడుగులు వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల తరువాత టాటాల ఖాతాలోకి ఎయిర్ ఇండియా రావడం నిజంగానే ఓ శుభ పరిణామం. అదేవిధంగా టాటాలు మరో అడుగు ముందుకు వేసి ఒడిశాకు చెందిన ఓ స్టీలు ఫ్యాక్టరీ ని కొనుగోలు చేసేందుకు సిద్ధం అయ్యారు. నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్) పేరిట అక్కడ నడుస్తున్న స్టీలు ఫ్యాక్టరీని కొనుగోలు చేసేందుకు సమయాత్తం అవుతున్నారు. ఇప్పుడీ పరిణామమే పెను సంచలనాలకు తావిస్తోంది.
ఒడిశాలో కళింగ నగర్ లో నడుస్తున్న ఈ ఫ్యాక్టరీ లో 97శాతంకు పైగా వాటా కొనుగోలుకు మొగ్గు చూపుతోంది. ఇందుకోసం పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తోంది. ఈ ప్లాంటు సామర్థ్యం 11 లక్షల టన్నులు అని ప్రధాన మీడియా వివరం అందిస్తోంది. ఇదంతా బాగుంది కానీ ఇదే సమయంలో మన వైజాగ్ స్టీల్ ను కూడా కొనుగోలు చేయొచ్చుగా ! త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి కానుంది అని తెలుస్తోంది.