దూకుడు నిర్ణయాలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు ఉంటారు. నిర్ణయాలు వేగంగా తీసుకోవడంతో పాటుగా వాటిల్లో ఒక స్పష్టత ఉండటం, తీసుకున్న నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గకపోవడం వంటివి మనం చూస్తూ ఉంటాం. ఒక్కసారి ఆయన నిర్ణయం తీసుకున్నారు అంటే ఎవరు ఎన్ని చెప్పినా సరే జగన్ నిర్ణయంలో మాత్రం ఏ మార్పు ఉండదు. పార్టీని ప్రతిపక్షంలో పదేళ్ళు నడిపించినా, ఇప్పుడు ఏడు నెలలుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నా సరే జగన్ తనకు తానే సాటి.
ఇప్పుడు ప్రభుత్వంలో ఆయన కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి ఆపేస్తే వ్యతిరేకత వస్తుందని ఎంత మంది చెప్పినా సరే జగన్ ఎంత మాత్రం వినలేదు. రాజకీయంగా నష్టపోతామని చెప్పినా సరే జగన్ నిర్ణయంలో ఇప్పుడు మార్పు కనపడటం లేదు. రాజధాని విషయంలో కేంద్రం ఆగ్రహంగా ఉందని చెప్పినా సరే జగన్ వినడం లేదు. అలాగే కొన్ని కొన్ని చట్టాల విషయంలో కూడా జగన్ ఇలాగే వ్యవహరించారు. దిశా చట్టాని రూపొందించే సమయంలో కేంద్రం సలహాలు తీసుకోవాలని,ప్రధాని కార్యాలయాన్ని సంప్రదించాలని చెప్పినా జగన్ వినలేదు.
స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అని చట్టం తీసుకొచ్చారు. దీనిపై అనేక విమర్శలు వచ్చినా సరే జగన్ వినలేదు. ఇప్పుడు దీనికే తెలుగుదేశం క్యాడర్ ఎక్కువగా ఫిదా అయిందని అంటున్నారు. చంద్రబాబు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే ఏళ్ళకు ఏళ్ళు సమయం తీసుకుంటారని, ఎన్నో చర్చలు సమీక్షలు జరిపి కాలం వృధా చేస్తారని జగన్ అలా లేరని, ఆయనను చూసి ఇప్పటికి అయినా చంద్రబాబు నేర్చుకోవాలని వాళ్ళు సూచిస్తున్నారు.