ఏపీలో కుల రాజకీయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఎన్నికల్లో గెలవడానికి కులాల ఆధారంగా రాజకీయం నడపటంలో అటు జగన్, ఇటు చంద్రబాబు సిద్ధహస్తులే. సమయానికి తగ్గట్టుగా కులాల ఆధారంగా రాజకీయం నడిపిస్తారు. మొన్నటివరకు బీసీలపై కుల రాజకీయం నడిపిన విషయం తెలిసిందే. బీసీలు నా ప్రాణమని జగన్..బీసీలు అసలు టీడీపీ డీఎన్ఏ అని చెప్పి చంద్రబాబు భజన చేశారు.
ఇలా బీసీలపై రాజకీయం నడిపిన రెండు పార్టీలు ఇప్పుడు కాపులపై పడ్డారు. ఇటీవల కాపు రిజర్వేషన్లపై రగడ నడిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు వంగవీటి రంగా వర్ధంతిని చేయడానికి పోటీ పడుతున్నారు. రెండు పార్టీలు సైతం కాపుల ఓట్ల కోసం రంగా వర్ధంతిని నిర్వహించడానికి పోటాపోటిగా ఉన్నారు. ఇప్పటికే ఈ అంశంలో గుడివాడలో వైసీపీ-టీడీపీ వర్గాలు కొట్టుకునే వరకు వెళ్ళాయి. గుడివాడలో రంగా వర్ధంతిని నిర్వహించాలని టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు సిద్ధమవ్వగా, కార్యక్రమం నిర్వహించడానికి వీలు లేదని కొడాలి నాని అనుచరుడు రావికి వార్నింగ్ ఇచ్చారు.
దీంతో రావి పోలీసులకు ఫిర్యాదు చేశారు..ఇదే క్రమంలో కొడాలి అనుచరులు..గుడివాడలో టీడీపీ ఆఫీసులో రావిపై దాడి చేయడానికి రాగా, వారిని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ లోపు పోలీసులు వచ్చి..రెండు వర్గాలని చెదరగొట్టి అక్కడ నుంచి పంపించేశారు. ఇలా రంగా వర్ధంతి విషయంలో రచ్చ నడిచింది.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా రంగా వర్ధంతిని జరిపి ఎవరికి వారు కాపు ఓట్లని కొల్లగొట్టాలని చూస్తున్నారు. తాజాగా విజయవాడలో రంగా విగ్రహావిష్కరణకు రాధాతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీలు సైతం హాజరయ్యారు. అటు ఉభయ గోదావరి జిల్లాల్లో రంగా వర్ధంతినీ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. అలాగే విశాఖలో పెద్ద ఎత్తున కాపునాడు కార్యక్రమం కూడా జరగనుంది. గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాపు నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా ఉన్నారు. మొత్తానికి కాపుల ఓట్ల టార్గెట్ గా అటు వైసీపీ, ఇటు టీడీపీలు పోటీ పడుతున్నాయి.