ఆంధ్రప్రదేశ్ టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. మొన్న జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకి నిరసనగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడే రెచ్చిపోయిన అధికార పార్టీ ఇప్పుడు ఆయన లేకుండా జరిగే ఎన్నికలు మరింత దిగజారే అవకాశం ఉందని టీడీపీ చెబుతోంది.
నీలం సాహ్నీ నేతృత్వంలో జరిగే ఎన్నికలు ఏకపక్షమేనని, నిష్పాక్షికంగా జరగవు అనే విషయాన్ని తెలిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నీలం సాహ్నీ, పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్దంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. రేపు ఉదయం పది గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల మీద ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అంతకు ముందు కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష జరిపారు. పరిషత్ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కలెక్టర్లు, ఎస్పీల అభిప్రాయాలు తీసుకున్నారు.