ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మరోసారి జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లు, కాంట్రాక్టుల విషయంలో ఆయన ఆరోపణలు చేశారు. ముందుగానే ఓ వ్యక్తిని ఎంచుకుని, కాంట్రాక్టును ఆయనకే కట్టబెట్టాలని నిర్ణయించుకుని ఇప్పుడు రివర్స్ పేరుతో ముందుకు వెళ్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఆయన కాంట్రాక్టులు ఎలా ఇవ్వాలో.. చెప్పుకొచ్చారు. నిజానికి చంద్రబాబు హయాంలో ఆయన ఇప్పుడు చెప్పినట్టు కాంట్రాక్టులు ఇచ్చి ఉంటే ఈ తలనొప్పులు, న్యాయ వివాదాలు చోటు చేసుకునే అవకాశం లేకుండా పోయేదికదా? ఈ ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేకుండా పోయింది.
నవయుగ విషయాన్ని తీసుకుందాం. ఈ సంస్థకు 2017లో పోలవరం కాంట్రాక్టులోని 3 వేల కోట్ల రూపాయలు విలువ చేసే పనులను అప్పగించారు. అయితే ఆ సమయంలో ఎవరినీ పిలవకుండానే ఈ కాంట్రాక్టును నామినేషన్ పద్ధతిపై అప్పగించడం అప్పట్లోనే వివాదానికి కారణమైంది. అయితే, బాబు అనుకూల మీడియా దీనిని తొక్కిపెట్టడం, మీడియాలోనే నవయుగకు కావాల్సిన బంధుగణం ఉండడడం, సామాజిక సమీకరణలు వంటివి కూడా అప్పట్లో బాగానే పనిచేశాయి.
ఇక, ఈ ప్రాజెక్టును నవయుగకు అప్పగించడంపై అప్పట్లో కేంద్రం కూడా తప్పుపట్టింది. అదనంగా రూపాయి కూడా ఇచ్చేది లేదని తెగేసి చెప్పింది. దీనికి చంద్రబాబు అప్పట్లో మీరు ఇవ్వాల్సింది మీరు ఇవ్వండి.. మిగతాది నేను ఇస్తాను అంటూ.. ఎంతో పోయింది ఇప్పుడు ఇది లెక్కా! అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత నామినేషన్ పద్ధతిపై కాంట్రాక్టును ఎలా ఇస్తారనే ప్రశ్నతోనే రివర్స్ టెండర్లను ఆహ్వానించారు. ఇది న్యాయ పరిశీలనలో కూడా వీగి పోయే ప్రమాదం ఉండడంతో దీనిని రాజకీయం చేసేందుకు చంద్రబాబు అండ్ టీం రెడీ అయ్యారు.
జగన్ పాలనకు సంబంధించి రివర్స్ ఓ మేలిమలుపుగా నిలుస్తుందని తెలిసి కూడా వారు దీనిని రాజకీయం చేయడం రివర్స్ టెండర్లను కేవలం కొందరికే కట్టబెట్టాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారని ఆరోపించడం పసలేకుండా పోయింది. అయినా తన నిర్ణయాల్లో ఎవరైనా వేలుపెడితే.. రాష్ట్ర ద్రోహులుగా ముద్ర వేసిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్ నిర్ణయాలను వేలు పెట్టి చూపించడం ఇంకా ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలోనే తూట్లు పొడవాలని చూడడం ఆయన అనుభవానికే మాయని మచ్చలా నిలుస్తోందనే విమర్శలు వస్తున్నాయి.