రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు అవే మాటలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. వైసీపీ దూకుడు ముందు టీడీపీ నేతలు జిలానీల మాదిరిగా జంప్ చేస్తున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో టీడీపీ నుంచి ఇప్పటి వరకు ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. అధికారికంగా వైసీపీ జెండా కప్పుకోకపోయినా.. టీడీపీకి మాత్రం దూరమయ్యారు. ఎమ్మెల్యేలు కాకుండా ఇతర నేతల విషయానికి వస్తే.. వీరి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఇప్పుడు వినిపిస్తున్న అంచనాల ప్రకారం మరో ఇద్దరు గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు.
అది కూడా పార్టీ కీలకంగా భావించే మహానాడు సమయంలో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీయడం.. కూడా టీడీపీ మరో ఘాటు దెబ్బగానే భావించాల్సి వస్తోందని అంటున్నారు పరిశీలకులు. నిజానికి ఏడాది కాలంలో అంటే.. ఎన్నికలు ముగిసిన తర్వాత ఏడాదిలో ఈ ఇద్దరు కూడా పార్టీమారితే.. మొత్తంగా ఐదుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగేసినట్టే అవుతుంది. నిజానికి పార్టీలో ఇది భూకంపం అనే చెప్పాలి. ఎందుకంటే.. పార్టీకి లభించిన ఎమ్మెల్యేలే.. కేవలం 23 మంది. ఇప్పుడు వీరిలో ఐదుగురు జంప్ అయితే.. ఇక, మిగిలేది.. 18 మంది. ఇది నిజానికి చంద్రబాబుకు ప్రమాద ఘంటికలు మోగిస్తుందనే చెప్పాలి.
తొలి ఏడాదిలోనే పరిస్థితి ఇలా ఉంటే.. మరో నాలుగేళ్ల పాటు పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్తారు ? అనేది కీలక ప్రశ్న. పైగా ప్రధాన ప్రతిపక్షం.. అనే హోదా ప్రమాదంలోనూ పడనుంది. ఇది పోతే.. చంద్రబాబుకు సెక్యూరిటీ పరంగా.. హోదా పరంగా .. కూడా తీవ్ర సంకట స్థితిని ఎదుర్కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక పార్టీని నడిపించడం కూడా అంత తేలిక కాదు.. మరో ఏడాది మొత్తంగా చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది ? అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ సమయంలో పార్టీని నిలబెట్టుకునేందుకు చంద్రబాబు అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టి పెట్టాలనేది సీనియర్ల మాట. మరి ఏం చేస్తారో చూడాలి.
ఒక వేళ… వైసీపీ దూకుడు పెంచితే.. పార్టీ నుంచి ఎమ్మెల్యేలు సహా నాయకులు జంప్ చేస్తే.. పార్టీ తీవ్రస్థాయిలో దెబ్బతినే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. మరీ ముఖ్యంగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకులనే వైసీపీ నేతలు టార్గెట్ చేయడం కూడా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఇప్పటి వరకు పార్టీలో ఈ సామాజిక వర్గానిదే పైచేయి. అలాంటి వర్గాన్ని తనవైపు తిప్పుకోవడం ద్వారా బాబును నైతికంగా కూడా దెబ్బతీయాలనేది వైసీపీ వ్యూహం అయితే.. బాబు దీనిని ఎదుర్కొనేందుకు చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా.. ఇప్పటి వరకు పార్టీ పరిస్థితి వేరు.. రాబోయే నాలుగేళ్ల పరిస్థితి వేరు. ఏడాదితో పార్టీలో భూకంపం ఏర్పడిందంటే.. వచ్చే నాలుగేళ్ల పరిస్థితి ఏంటి ? అనేది ప్రధానంగా చర్చకు వస్తోంది. మరి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.