తెలుగుదేశం పార్టీ ( TDP Party ) కి తెలంగాణలో నేతలే లేకుండా పోయారు. ఒక్కొక్కరుగా అందరూ వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. కేడర్ కూడా నేతలతోనే వెళ్లిపోయింది. ఇక ఏపీలో టీడీపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీ ప్రతిపక్షనేతగా ఉన్నారు. అయితే, 2014 ఎన్నికల్లో తనదైన వ్యూహాలు వేసుకుని ఎన్నికల్లో విజయం సాధించిన చంద్రబాబు 2019లో మాత్రం ఘోరంగా ఓడిపోయారు. ఈ ఓటమికి ప్రధాన కారణం కాపు సామాజిక వర్గాన్ని తన వైపు నిలుపులేకపోవడమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు అంచనా వేశారు.
అయితే, ఇప్పటికీ ఆ సామాజికవర్గం టీడీపీ వైపు లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. 2014 ఎన్నికలకు ముందు కాపు సామాజిక వర్గ నేతలతో సమావేశమై, ఆ సామాజిక వర్గానికి పలు హామీలు ఇచ్చి వారి విశ్వాసాన్ని పొందాడు. కానీ, 2019 వచ్చే సరికి వారి నమ్మకాన్ని నిలుపులేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ రిజర్వేషన్ పట్ల పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ కాపు సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేయగలిగిందని తెలుస్తోంది. కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం తన చేతుల్లోలేదని వైసీపీ అధినేత జగన్ ముందే ప్రకటించారు.
అయినప్పటికీ కాపు సామాజిక వర్గం వైసీపీ వైపునే ఉండింది. జగన్ ఇటీవల ‘నేతన్న హస్తం’ కింద 2,384 మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి మేలు చేశారు. అయితే, అనవసర హామీలు ఇచ్చి కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తన నుంచి దూరం చేసుకున్నారని, ఇప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. పరిస్థితులు ఇలానే కొనసాగితే టీడీపీ రాజకీయ భవిష్యత్తు అంతంత మాత్రంగానే ఉండే చాన్సెస్ ఉన్నాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.