రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై భారీ మినహాయింపులనిచ్చింది. కేంద్రం నిబంధనల ప్రకారం కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్నవారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హులు. అయితే వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్నప్పటికీ 5 ఎకరాలు కంటే ఎక్కువ వ్యవసాయ భూమి, పట్టణాలు, నగరాల్లో ఫ్లాటు ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అనర్హులు అని కేంద్ర నిబంధనలు చెబుతున్నాయి.
అయితే కేంద్ర నిబంధనల నుంచి ఏపీ సర్కార్ మినహాయింపు ఇచ్చింది. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉండాలన్న ఒక్క నిబంధన మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. మిగతా కేంద్ర నిబంధనల నుంచి వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెస్తూ జీవో విడుదల చేసింది. ఆ జీవోలో పై విషయాలను స్పష్టం చేసింది. అలానే విద్యాసంస్థల్లో ప్రవేశాలకూ రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం ఉండాలన్న ఒకే ఒక్క నిబంధననే వర్తింపజేస్తూ మరో ఉత్తర్వు కూడా ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియామాకలకు మాత్రమే ఈ మినహాయింపులు వర్తించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాలకు కేంద్ర నిబంధనలే యథాతథంగా అమల్లో ఉండనున్నాయి.