టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఇంటిని చక్కబెట్టుకోలేక పోతున్నారా ? పార్టీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయి.. ఏడాదిన్నర అయినా.. ఇప్పటికీ.. దానిని గాడిలో పెట్టలేక పోయారా ? మరీ ముఖ్యంగా నాయకులను పార్టీలో నిలబెట్టుకునే చర్యలను కూడా ఆయన చేయలేకపోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. మరి దీనికి కారణాలేంటి ? చంద్రబాబు ఎందుకు విఫలమవుతున్నారు ? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. దీనికి చంద్రబాబు చేస్తున్న ఉదాసీన వైఖరేనని చెబుతున్నారు. ఏ పార్టీలో అయినా విభేదాలు ఉంటాయి. విమర్శలు ఉంటాయి. అసంతృప్తులు కూడా ఉంటాయి.
అదే సమయంలో పార్టీ అధికారంలో లేదు కాబట్టి.. నాయకుల్లో నిస్తేజం కూడా ఉంటుంది. ఈ సమయంలోనే కదా.. పార్టీ అధినేతపై నాయకులకు, కార్యకర్తలకు నమ్మకం కలిగేలా వ్యవహరించాల్సింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్.. నేతల్లో ఎక్కడా నిస్తేజ వైఖరి కనిపించకుండా ముందుకు వెళ్లారు. పార్టీ ప్లీనరీలు పెట్టారు. బీసీ కమిటీలు వేశారు. దీక్షలు చేశారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించారు. దీంతో జగన్‌పై ఎవరికీ నమ్మకం సన్నగిల్లలేదు. అంతేకాదు.. జగన్ వ్యతిరేక పత్రికలు, చంద్రబాబు సర్కారు కూడా ఆయన ఇంకేముంది.. త్వరలోనే జైలుకు వెళ్తారని, నేరస్తుడని విపరీత ప్రచారం చేసి.. వైసీపీని విచ్చిన్నం చేయాలని చేసిన ప్రయత్నాలను కూడా జగన్ తట్టుకుని నిలబడ్డారు.
ఈ తరహా వ్యూహం టీడీపీలో ఎక్కడో లోపిస్తోంది. అందుకే చంద్రబాబుపై నేతల్లో విశ్వాసం సన్నగిల్లుతోం దని అంటున్నారు పరిశీలకులు. ఆదిలోనే తనపై ఏర్పడుతున్న అపనమ్మకాన్ని తొలగించుకునే ప్రయత్నం చేసి ఉంటే.. తన కుమారుడు తదుపరి అధ్యక్షుడు అవుతాడని తెలియగానే పెల్లుబికిన వ్యంగ్యాస్త్రాలకు దీటుగా జవాబు ఇచ్చి ఉంటే.. తొందరపడి ఆయనను మంత్రిని చేయకుండా ఉండి ఉంటే.. చంద్రబాబుపై నమ్మకం ఉండేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ, ఆయన గోటితోపోయే దానికి గొడ్డలిదాకా తెచ్చుకున్నారు.
ఇప్పుడు ఎమ్మెల్యేలే కాదు.. మహిళా నాయకురాళ్లు.. సీనియర్లు, మాజీ మంత్రులు కూడా జంపింగుల జాబితాలో ఉన్నట్టు వార్తలు వస్తుండడంతో చంద్రబాబు వ్యూహం విఫలమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టీడీపీ హవా తగ్గలేదని పైకి చెప్పుకొన్నా.. ప్రజల్లో ఇప్పుడు సింపతీ లేదనేది మాత్రం వాస్తవం.. అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఏం చేస్తారో ? చూడాలి.
-Vuyyuru Subhash