ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ చేసుకున్న వైసీపీ అదే దూకుడుతో మున్సిపల్ ఎన్నికల్లోనూ స్పీడ్ పెంచింది. మొదటి నుంచి టీడీపీకి పట్టున్న ఓ కార్పొరేషన్లో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీకి ఎదురుగాలి వీస్తోంది. పదవులన్నీ అనుభవించిన నేతలు ప్రతిపక్షంలోకి రాగానే మొహం చాటేయడంతో..తమ్ముళ్లు ఒంటరి వాళ్లై పోయారు. కనీసం లీడ్ చేసే నాయకుడు కూడా లేక తలోదారి చూసుకుంటున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్లో టీడీపీకి దిశా నిర్దేశం చేసే నాయకుడే కరవయ్యాడు. గత మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే బడేటి బుజ్జి పార్టీని లీడ్ చేసి 50 డివిజన్లలో 42 చోట్ల గెలిపించడంతో కార్పొరేషన్‌ను టీడీపీ కైవసం చేసుకుంది. ఆయన చనిపోవడంతో బుజ్జి తమ్ముడు బడేటి చంటికి కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించింది పార్టీ అధిష్టానం. కానీ చంటి పార్టీని బలోపేతం చేయడంలో వెనుకబడ్డారు.
ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ల నాని మంత్రి కూడా కావడంతో ఏలూరు వైసీపీలో బలమైన లీడర్లతో పాటు కేడర్ కూడా ఉంది. కానీ..టీడీపీని లీడ్ చేసేవాళ్లు లేక ఆ పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అసలు పార్టీలో ఉన్నాడో లేడో కూడా కార్యకర్తలకు తెలియడం లేదు. అధికారం ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించిన నేతలు ప్రతిపక్షంలోకి వచ్చాక పోరాడటానికి ముందుకు రావడం లేదు. ఇక్కడ నాయకత్వ లోపాన్ని గుర్తించి సరిచేయాల్సిన పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఏలూరుపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు.
పశ్చిమ గోదావరి జిల్లా అంటే టీడీపీకి కంచుకోట. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ ఉనికి కాపాడుకోవడానికే కష్టపడాల్సి వస్తుంది.
మరోవైపు అధికార పార్టీ మేయర్ ఎన్నికకు కావాల్సిన కార్పొరేటర్లను ఏకగ్రీవం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మంత్రి ఆళ్ల నాని స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఎక్కడా నాయకుల మధ్య విభేదాలు లేకుండా, రెబల్స్ తలనొప్పులు లేకుండా పరిస్థితులు చక్కబెడుతున్నారు. టీడీపీ, జనసేన శ్రేణులు పెద్దఎత్తున ఆళ్ల నాని సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు.
మొత్తమ్మీద వైసీపీ పక్కా వ్యూహంతో ఏలూరు కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడానికి దూకుడుగా వెళ్తోంది. కానీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన టీడీపీ పది డివిజన్లు అయినా గెలిచి పరువు నిలబెట్టుకుంటుందా అన్న చర్చ ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో దడ పుట్టిస్తుంది.