మీరే రావాలి… వెంటనే రావాలి ! కొంపలు అంటుకుపోతున్నాయ్ ?

-

ఎవరు ఉండేలా కనిపించడం లేదు. ఎవరికి వారు తమ దారి తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏదో అద్భుతం జరుగుతుందని ఆశగా ఇప్పటి వరకూ ఎదురు చూసినా, వారూ ఇప్పుడు తట్టా బుట్టా సర్దుకుని చెక్కేస్తున్నారు. మరికొందరు వారి బాటలో వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇదంతా ఇప్పుడు ఏపీ టీడీపీలో నెలకొన్న గందరగోళం. భవిష్యత్తుపై బెంగతో నాయకులంతా ఎవరి దారి వారిదే అన్నట్లుగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అసలే ఉన్నది అతి కొద్ది మంది ఎమ్మెల్యేలు మాత్రమే. వారు కూడా ఇప్పుడు భవిష్యత్తు పై బెంగతో పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న పరిణామాలు టిడిపి లో కలవరం పుట్టిస్తున్నాయి. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే వెళ్ళిపోతే నియోజకవర్గంలోని క్యాడర్ లో మరింత భయాందోళనలు పెరిగిపోయి, వారు కూడా అదే బాటలో వెళ్లిపోతున్నా సీన్ ఇప్పుడు టిడిపిలో కనిపిస్తోంది.

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాదులోని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడి నుంచి ఆయన ఇప్పట్లో ఆయన ఏపీకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. కరోనా భయం కారణంగా చంద్రబాబు ఇప్పుడు ఏపీకి రావడం అంత సేఫ్ కాదనే ఉద్దేశంతో ఆయన కష్టంగానే ఇంట్లో ఉంటున్నారు. ఇదే అదనుగా వైసిపి రైతులకు ప్రోత్సాహం ఇవ్వడం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా దక్కకుండా చేయాలనే అభిప్రాయంతో వ్యవహరిస్తుండడం, ఇవన్నీ ఇప్పుడు టిడిపికి ఇప్పడు శాపాలుగా మారాయి. కరోనా వైరస్ ప్రభావం ఏపీలో ఇంకా ఎంత కాలం ఉంటుందో చెప్పలేము.

అప్పటి వరకు చంద్రబాబు ఇంటికే పరిమితం అయితే, పార్టీని పూర్తిగా ఖాళీ చేసే పనిలో ఇటు వైసీపీ అటు బిజెపి ఉంటాయి. అందుకే చంద్రబాబు ఇంకా ఇంట్లోనే కూర్చుంటే లాభం లేదని, ఏపీకి వచ్చి పార్టీ నేతలతో అన్ని విషయాలను క్షుణ్ణంగా చర్చించి, వలసలు వెళ్లకుండా పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు భరోసా కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే పార్టీలో ఎవరూ ఉండరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గల్లీ లీడర్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడు వరకు అంతా టిడిపిలో భయాందోళనలతో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.

ఒకవైపు పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందా లేదా అనే అనుమానం మరోవైపు పెరిగిపోతుండడంతో, ఎవరికివారు తమ దారి తమదే అన్నట్టుగా చూసుకుంటూ, తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా లేకుండా చేసుకునేందుకు పార్టీ మారిపోతున్నారు. ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిస్తే ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేసేవారు. నాయకుల కంటే కార్యకర్తలు మరింత యాక్టివ్ గా ఉండే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరిలోనూ పార్టీ భవిష్యత్తుపై నమ్మకం లేకపోవడం, ఇక పార్టీ పుంజుకునే అవకాశం లేదు అనే ఒక అభిప్రాయం ఏర్పడడంతో ఈ పరిస్థితి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఈ దశలో చంద్రబాబు జిల్లా పర్యటన చేపట్టి, పార్టీ కేడర్లో ఉత్సాహం నింపాలని సీనియర్ నాయకులు కోరుతున్నారు. కానీ కరోనా ప్రభావంతో చంద్రబాబు గడప దాటేందుకు ఇష్టపడకపోవడం వంటివి ఇప్పుడు టిడిపికి శాపంగా మారాయనే అభిప్రాయాలు సొంత పార్టీ నాయకుల నుంచే వ్యక్తమవుతున్నాయి.

-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version