అవును! రాష్ట్రంలో గడిచిన నాలుగు రోజుల్లో రెండు కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు పరిణామాలు కూడా ప్రతిపక్షాల కారణంగా జరిగినవే! ఈ రెండు పరిణామాలతోనూ విసుగెత్తిన ఇద్దరు మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసే వరకు వచ్చింది. దీంతో అసలు రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అధికార పార్టీ నేత జగన్ ముకుతాడు వేయలేక పోతున్నారా? అనే సందేహాలు తెరమీదికి వస్తున్నాయి. రెండు రోజుల కిందట ఒంగోలు నుంచి తమిళనాడులోకి వెళ్లిన ఓ కారును అక్కడి పోలీసులు పట్టుకున్నారు.
తనిఖీల్లో సదరు కారులో 5.27 కోట్ల రూపాయలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కారుపై స్టిక్కర్ ఉంది. దీంతో వెంటనే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి ముడిపెట్టి.. ఈ సొమ్ము ఆయనదేనని అక్కడి స్థానిక తమిళ ఛానెల్ ప్రచారం చేసింది. దీనిని అందిపుచ్చుకున్న ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మంత్రిని టార్గెట్ చేసేసింది. ఆ సొమ్ము మంత్రిదేనని, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని పట్టుకుంటున్నారు కానీ, ఇక్కడ నుంచి తరలించేస్తున్న కోట్లకు కోట్లను మాత్రం పట్టుకోలేక పోతున్నారంటూ.. బురదజల్లే ప్రయత్నం చేశారు.
ఇక, దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక జడ్జిపై వైసీపీ నాయకులు భౌతిక దాడికి దిగారనే వార్తను ఎల్లో మీడియా పెద్దది చేసింది. మంచిదే.. నిజంగా అలాంటి ఘటనను ఎవరైనా ఖండిస్తారు. అయితే, ఇక్కడ ఈ ఘటనలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని పేర్కొనడంతో ముందు వెనుక కూడా ఆలోచించుకోకుండా.. టీడీపీ నేతలు పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు.
ఈ రెండు ఘటనలతో తీవ్ర మనస్థాపానికి గురైన ఇద్దరు మంత్రులు కూడా ఆయా కేసుల్లో తమ ప్రమేయం ఉందని నిరూపిస్తే.. తమ పదవులకు రాజీనామా చేస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటనలను ప్రేరేపించడం ద్వారా టీడీపీ జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందని అంటున్నారు. మరి ఈ పార్టీని నిలువరించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు పరిశీలకులు.