చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సీనియర్ రాజకీయ నేత. టీడీపీలో సుధీర్ఘ కాలం ఆయన సేవలు అందించారు. క్షేత్రస్థాయిలో ప్రజాబలం ఉన్న నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీలో కీలకంగా చక్రం తిప్పారు. పార్టీ అంటేనే బొజ్జల.. బొజ్జల అంటేనే టీడీపీ అనే రేంజ్‌లో ఆయన ఇక్కడ ఓ వెలుగు వెలిగారు. 2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అటవీ శాఖ మంత్రిగా కూడా బొజ్జల కీలక చక్రం తిప్పారు. ఆయన ఆధ్వర్యంలోనే ఎర్రచందనం అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటై.. విలువైన సంపద చుట్టూ తిరిగిన అక్రమాలకు కొంత మేరకు బ్రేక్ పడింది.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం, పార్టీలో వినయంగా ఉండడం, పార్టీ అధినేత కు విధేయుడిగా ఉండడం అనేవి బొజ్జలకు రాజకీ యంగా అబ్బిన మంచి లక్షణాలు. వీటికి తోడు ఆయన ఎక్కడా వివాదాలకు పోకుండా అందరినీ కలుపుకొని పోతూ.. రాజకీయాలు చేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు సాధించారు. 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా ఇక్కడ టీడీపీ జెండాపై విజయం సాధించారు. తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలైనా.. నిత్యం ప్రజల్లో ఉన్న కారణంగా 2009లో రాష్ట్ర మంతా వైఎస్ గాలులు వీచినా.. ఆ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఆ ఎన్నికల్లోనూ గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ బొజ్జల ఘన విజయం సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన బాబు హయాంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, అనారోగ్యం కారణంగా 2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆయనను బాబు పక్కన పెట్టారు. దీంతో అలిగిన ఆయన కొంత మేరకు ధిక్కార స్వరంవినిపించారు. అనారోగ్యంతో ఉన్న తాను మంత్రిగా పనిచేయలేనప్పుడు.. ఎమ్మెల్యేగా మాత్రం ఎందుకంటూ.. ప్రశ్నించారు. అయినప్పటికీ.. పార్టీ పట్ల విధేయతతో ఆయనే కొనసాగారు. ఇక, ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి రంగంలోకి దిగారు. అయితే, ఆయన తండ్రి హవాను అందిపుచ్చుకోలేక పోయారు.
దీంతో 30 వేల పైచిలుకు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక తండ్రి అధికారంలో ఉన్నప్పుడే బొజ్జల సుధీర్‌రెడ్డితో పాటు, గోపాలకృష్ణారెడ్డి భార్య చేతివాటాలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. సుదీర్ఘమైన బొజ్జల రాజకీయ జీవితంలో ఆయనపై ఏనాడు చిన్న మరక కూడా లేకపోయినా అటు భార్య, తనయుడి వల్ల ఆయనకు కొంత మైనస్ అయ్యింది. ఇక, రాజకీయాల్లో గెలుపు ఓటములు సాధారణమే అయినా.. ప్రజల్లో ఇప్పుడు ఎక్కడా బొజ్జల కుటుంబం ప్రభావం చూపించలేకపో తేందనే వాదన వినిపిస్తోంది.
నియోజకవర్గంలో ఐదు సార్లు గెలిచి, ప్రజల అబిభిమానం సొంతం చేసుకున్న తన తండ్రి వారసత్వాన్ని నిలబెట్టే దిశగా సుధీర్ ఎక్కడా పనిచేయడం లేదని కూడా అంటున్నారు. ఇటీవల చంద్రబాబు అనేక నిరసనలకు పిలుపు ఇచ్చినా.. సుధీర్ ఎక్కడా కనిపించలేదు. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయిన యువనేతలు అందరూ కొద్ది రోజుల విరామం తర్వాత బాగా యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు వీరంతా ప్రజాక్షేత్రంలో చురుకుగా కదులుతూ ప్రభుత్వ విధానాలపై పోరాడడంతో పాటు పార్టీ పిలుపు నిచ్చిన కార్యక్రమాల్లో చరుకుగా ఉంటున్నారు. సుధీర్‌రెడ్డి మాత్రం అనాసక్త రాజకీయాలు చేస్తున్నట్టే పార్టీలోనూ చర్చలు నడుస్తున్నాయి. దీంతో ఈ కుటుంబ రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతోందనే ఆసక్తికర చర్చ సాగుతోంది.