Breaking : టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

-

తెలుగుదేశం పార్టీలో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. ఆయన గత జనవరిలో గుండెపోటుకు గురయ్యారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొన్నివారాలుగా మృత్యువుతో పోరాడారు. ఆయనను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు మొదటి నుంచి టీడీపీకి వీరాభిమాని. గతంలో ఆయన మచిలీపట్నం మున్సిపాలిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. పార్టీ కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి.. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అనంతరం తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2017లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు.

బచ్చుల అర్జునుడు మరణం పట్ల ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘నిజాయితీ నిబద్దత కల్గిన నేత బచ్చుల అర్జునుడు. ఆయన మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బచ్చుల అర్జునుడు కృష్ణా జిల్లాలో పార్టీ బలోపేతానికి చేసిన కృషి ఎనలేనిది. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. అర్జునుడు పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించేవారు. పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా అర్జునుడు ముందే ఉండేవారు. ఎమ్మెల్సీగా మండలిలో వైసీపీ మంత్రుల అబద్దాల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టారు. అర్జునుడి మృతితో టీడీపీ ఒక సమర్ధవంతమైన నేతని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్దిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version