ఏపీలో ఈ మధ్య కాలంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు వరుస ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టిడిపి తక్కువ సీట్లకే పరిమితమవ్వడమె కాక తన సొంత ఊరిలో టిడిపి అభ్యర్థి ఓటమిపాలవ్వడం జీర్ణించుకోలేక ఓ టిడిపి సీనియర్ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని శెట్టూరు మండలం చెర్లోపల్లిలో నిన్న రాత్రి జరిగింది. ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళితే చెర్లోపల్లికి చెందిన ఈడిగ నాగేంద్రప్ప గ్రామంలో టిడిపి సీనియర్ కార్యకర్తగా ఉన్నాడు.
తన స్వగ్రామంలోనూ టిడిపి బలపరిచిన అభ్యర్థి ఓటమిపాలయ్యాడు. వైసిపి బలపరిచిన అభ్యర్థి గొల్ల విరుపాక్షి టిడిపి బలపరిచిన అభ్యర్థి బోయ చంద్ర మీద 101 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. దీంతో మనస్తాపం చెందిన నాగేంద్రప్ప ఓటమిని భరించలేక ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఇతనికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. నాగేంద్రప్ప భార్యతో కలిసి ఉంటుండగా.. కొడుకు వేరే ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే, నాగేంద్రప్ప భార్యకు మతిస్థిమితం లేదని ఆయన నిన్న రాత్రి ఉరివేసుకున్నా ఆమె గుర్తించలేకపోయిందని స్థానికులు చెబుతున్నారు.