ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దావోస్ కు వెళ్లారు. ఆయన అక్కడ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో పాల్గొంటారు. తన తరుఫున రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని వెలువరించి, వివిధ పారిశ్రామిక వేత్తలతో సమావేశం తిరిగి వస్తారు. పెట్టుబడుల విషయమై సంబంధిత వర్గాలతో చర్చించి ఒప్పించి తిరిగివస్తారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అన్నది ఇదే తొలిసారి. ఆయన పాలన పగ్గాలు అందుకుని ఈ నెలాఖరుతో మూడేళ్లవుతోంది. కానీ ఇప్పటిదాకా ఆయన గుమ్మం దాటి, దేశం దాటి విదేశీ వీధులలో విహరించిన వైనం ఒక్కటంటే ఒక్కటీ లేదు.
సీబీఐ కోర్టు అనుమతితో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని ధ్యేయంగా ఎంచుకుని పర్యటన సాగిస్తున్నారు. ఈ దశలో నారా లోకేశ్ (టీడీపీ లీడర్) స్పందించారు. సోషల్ మీడియా ముఖంగా ఏమన్నారంటే…మా నాన్నని ద్వేషించేవారు, విమర్శించేవారు సైతం ఆఖరికి ఆయన మార్గంలో నడవాల్సిందే. సంక్షేమం నుండి ఐటి వరకూ.. అమరావతి నుండి విదేశాలు వెళ్లి పెట్టుబడులు ఆకర్షించడం వరకూ చంద్రన్న మార్గమే రాజమార్గం. దావోస్ ఎందుకు డబ్బులు దండగ అన్న జగన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా స్పెషల్ ఫ్లైట్ లో దావోస్ పర్యటన కు వెళ్లాల్సి వచ్చింది. బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో.! అని విమర్శలు చేశారు.
ఇంతకూ దేవుడి స్క్రిప్ట్ అంటే ఏంటి అన్న వాదన ఒకటి వైసీపీ కూడా వినిపిస్తోంది. తమకు అనుగుణంగా అన్నీ ఉంటే దానినే దేవుడి స్క్రిప్ట్ అంటారేమో ! ఆ విధంగా చూసుకుంటే పాలన పరంగా మరియు ప్రజల పరంగా తామే అన్ని విధాలా ముందున్నామన్నది వైసీపీ వాదన. కనుక ఆ రోజు ఏం జరిగింది అన్నది అటుంచితే ! తమ అధినేత మంచి ఫలితాలు అందుకునే వస్తారని వైసీపీ అంటోంది. ఇందులో ఎటువంటి సందేహాలకూ తావేలేదని చెబుతోంది. పెట్టుబడులకు సంబంధించి
ఇప్పటికే ఓ పాలసీని సిద్ధం చేశామని, దీని ప్రకారం అన్ని వర్గాలకూ మేలు చేసే విధంగానే తమ విధానం ఉండనుందని అంటోంది వైసీపీ.
ఇక టీడీపీ మాత్రం ఘోరంగా విమర్శలు చేస్తోంది. విదేశీయానం పేరిట ఆయన లగ్జరీ విమానాల్లో ప్రయాణాలు చేస్తూ ప్రజల సొమ్మును వృథా చేస్తున్నారని అంటోంది. ప్రభుత్వ కార్యక్రమానికి భార్యను ఎందుకు వెంట బెట్టుకుని వెళ్లడం అని ప్రశ్నిస్తోంది.ఇది విదేశీ ప్రయాణంలా లేదని హనిమూన్ కు వెళ్తున్న విధంగా ఉందని కూడా అంటోంది. ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గుడివాడ ను వెంటబెట్టుకుని ఎందుకు వెళ్లలేదని కూడా ప్రశ్నిస్తోంది. ఆ రోజు తమ అధినేతను ఉద్దేశించి ఎన్నో మాటలు అన్న వాళ్లంతా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారని కూడా అంటోంది.