ఏపీ సీఎం జగన్ నగదు బదిలీ ఎంత గొప్పగా అమలు చేస్తున్నారు అనే విషయంలో ఎవరికీ సందేహం అక్కరలేదు! ఈ విషయంలో అన్ని వర్గాల నుంచీ జగన్ కు అభినందలు వస్తున్నాయి. పైగా ఇది కరోనా కాలం అవ్వడంతో జగన్ నగదు బదిలీ విలువ ఇంకా విలువైందిగా మారిపోయింది. ఈ క్రమంలో… వైకాపా పథకాలు అన్నీ కేవలం వారి కార్యకర్తలకు, సానుభూతిపరులకు మాత్రమే అందుతున్నాయని, టీడీపీ కార్యకర్తలకు అందడం లేదని విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు సరైన సమాధానంగా నిలిచే సంఘటన తాజాగా ప్రకాశం జిల్లాలో జరిగింది!
ప్రకాశం జిల్లాలో ఒక “పక్కా టీడీపీ కుటుంబానికి” చెందిన ఒక ఆటో డ్రైవర్ కు చెందిన కుటుంబానికి వైకాపా పథకాల ద్వారా ఎంతటి లబ్ధి చేకూరిందనే విషయంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది! ఆ ఆటో డ్రైవర్ కు టైలరింగ్ చేసుకుంటున్న భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారంట. వారిలో అబ్బాయి డిగ్రీ చదువుతుండగా.. అమ్మాయి 9వ తరగతి చదువుతోందట.
ఈ నేపథ్యంలో వీరికి… అమ్మాయికి “అమ్మ ఒడి” కింద రూ.15వేలు, డిగ్రీ చదువుతున్న అబ్బాయికి “జగన్ అన్న విద్యాదీవెన” కింద రూ.20వేలు, యజమాని ఆటో డ్రైవర్ కావడంతో “వాహనమిత్ర” పథకంలో రూ.10వేలు, ఇతడి భార్య టైలర్ కావడంతో “జగనన్న చేదోడు” పథకం కింద రూ.10వేలు, అనంతరం “రైతు భరోసా” కింద రూ.12500 లబ్ధి చేకూరాయి. అంటే… అక్షరాలా మొత్తం ఆ కుటుంబానికి రూ.67500 సాయం కేవలం జగన్ ప్రభుత్వం నుంచి అందినట్టు అయ్యింది.
ఈ విషయాలపై వైకాపా నాయకులు ఆ ఆటో డ్రైవర్ ను సంప్రదించి అభిప్రాయం అడగ్గా… కరొనా సమయంలో జగన్ చేసిన సాయం మామూలిది కాదని, అందుకు తమ కుటుంబం ఎంతో రుణపడి ఉంటుందని చెబుతూనే… తాను మాత్రం పక్కా టీడీపీ మనిషిని అని, తన ఓటు మాత్రం ‘టీడీపీకే’ అని అన్నాడంట! ఎందుకంటే… తాము పార్టీ పెట్టినప్పటినుంచీ టీడీపీకే ఓటు వేస్తున్నామని అంట!
ఆ సంగతి అలా ఉంటే… ఇది అచ్చెన్నాయుడు వంటి వాళ్లకు సరైన సమాధానం అని అంటున్నారు విశ్లేషకులు! వైకాపా పథకాలు టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ సానుభూతిపరులకు అందడం లేదని ఆన్ లైన్ లో ఛాలెంజ్ లు చేస్తున్న అచ్చెన్నాయుడు, పథకాలన్నీ వైకాపా కార్యకర్తలకే అందుతున్నాయంటూ నోరుపారేసుకుంటున్న ఇతర టీడీపీ నేతలకు… ఈ సంఘటనే చెంపపెట్టులాంటి సమాధానం అని అంటున్నారు!!