కమాండ్ కంట్రోల్ సెంటర్​ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్

-

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్​లో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరుకున్న కేసీఆర్​కు పోలీసులు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్.. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి కమాండ్ కంట్రోల్ సెంటర్​ను వైభవంగా ప్రారంభించారు. ఏడు ఎకరాల విస్తీర్ణంలో 600 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి… అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగులు దిద్దిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు.

ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలను వీక్షించేలా బాహుబలి తెరను ఏర్పాటు చేశారని తెలిపారు. ఊహించని విపత్తులు తలెత్తినప్పుడు అన్ని శాఖల అధికారులు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉండి సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో 5 టవర్లు ఏర్పాటు చేశారు. టవర్- ఏలో 20అంతస్థులు నిర్మించారు. అన్ని టవర్లలో ఇదే ఎత్తైనది. ఇందులోని 4వ అంతస్తులో డీజీపీ ఛాంబర్, 7వ అంతస్తులో సీఎస్, సీఎస్ ఛాంబర్లు ఉన్నాయి. 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది. టవర్- ఏ పైన హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. టవర్- బీని 15 అంతస్తులతో నిర్మించారు. ఇందులో పూర్తిగా పోలీసుశాఖకు సంబంధించిన సాంకేతిక విభాగాల కార్యాలయాలు ఉండనున్నాయి. డయల్ 100, షీటీమ్స్, నార్కోటిక్స్, సైబర్ క్రైం కార్యాలయాలు టవర్-బి నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నాయి..

14 అంతస్తులో మ్యూజియం ఏర్పాటు చేశారు. అందులో పోలీసుశాఖ ప్రాశస్త్యం తెలియజేసేలా ఏర్పాట్లు చేశారు. 15వ అంతస్తులో 360 డిగ్రీలో నగరాన్ని చూసేలా ఏర్పాట్లున్నాయి. నగరంలోని ప్రజలు 15 అంతస్తులోకి ఎక్కి నగరాన్ని వీక్షించే అవకాశం కల్పించనున్నారు. నామమాత్ర ప్రవేశ రుసుం వసూలు చేయనున్నారు. టవర్ ఏ-బీలను అనుసంధానించేలా స్కైవాక్ ఏర్పాటు చేశారు.

దేశంలోనే అతి బరువైన స్కైవాక్ ఇదేనని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. టవర్- సీలో మూడు ఫ్లోర్లు ఉన్నాయి. ఇక్కడ 480 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం ఏర్పాటు చేశారు. టవర్- డిలో రెండు ఫ్లోర్లు ఉన్నాయి. ఇక్కడ మీడియా కేంద్రంతో పాటు… ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 12 లిఫ్టులున్నాయి..టవర్- ఈలో కమాండ్ కంట్రోల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పలు శాఖలను సమన్వయం చేసుకోవడంతో పాటు సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షించడానికి… 4,5,6వ అంతస్తులలో ఛాంబర్లు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లోని అన్ని సీసీ కెమెరాలతోపాటు… రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాల సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించనున్నారు. ఏకకాలంలో లక్ష సీసీ కెమెరాలను వీక్షించేలా బాహుబలి తెరను ఏర్పాటు చేశారు. ఏదైనా ఊహించని ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి… క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులకు, ఇతర శాఖల అధికారులకు తగిన సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version