తన చెల్లి షర్మిలను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నారని ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. షర్మిల తమ పార్టీ సభ్యురాలని తమకు పొరుగున ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలన్నారు. అందువల్ల ఆమెకు ఎంత వరకు అవసరమో అంత వరకు తాను కచ్చితంగా మద్దతు ఇస్తానని ఇందులో తప్పేముందన్నారు. గురువారం ఎన్డీటీవీతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. జగన్ కు, షర్మిలకు మధ్య ఏదైనా కుటుంబ తగాదాలు ఉంటే అది వారి వ్యక్తిగతమని జగన్ కోసం కాంగ్రెస్ పోటీ నుంచి తప్పకోవాలా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ పరంగా షర్మిలకు ఎంత వరకు అవసరమైతే అంత వరకు తప్పకుండా మద్దతుగా ఉంటానని అవకాశం లభిస్తే ఏపీలో మరోసారి ప్రచారానికి వెళ్తానన్నారు.ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి పోతారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని అతడి వ్యాఖ్యలను తాము కానీ తెలంగాణ ప్రజలు కానీ సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. తండ్రిపేరుతో మంత్రి అయిన కేటీఆర్ విరామం దొరికినప్పుడల్లా వచ్చి ప్రెస్ మీట్ పెడుతారని ఆరోపించారు