తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి 400పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేల మార్క్‌కు చేరువలో ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 3వేల 960మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 25వేల 989 శాంపిల్స్ పరీక్షించగా, 477 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 258 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 107, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 56 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 24గంటల వ్యవధిలో మరో 279 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఊరట కలిగించే విషయమేంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.