కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రాన్ని వణికిస్తుంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు సైతం కరోనా భారీన పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్ భారీన పడ్డారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, ఇంకా కొంతమంది నేతలు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు.
ఇకపోతే ఇవాళ ఉదయం తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో తెలంగాణలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, తాజాగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్, మాజీ మంత్రి టి.పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ వార్తతో టిఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరిలో ఆందోళన మొదలైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.