లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో టీ-బీజేపీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టనుంది. ఫిబ్రవరి 20 నుండి మార్చి 2వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ‘విజయ సంకల్ప’ యాత్ర చేపట్టనుంది.ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విజయ సంకల్ప యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..రాష్ట్ర ప్రజలను పదేళ్ల పాటు బీఆర్ఎస్ మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. చీకటి రాజకీయాలు తాము చేయబోమని.. ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు ఉండదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అవసరం లేదన్నారు. 114 అసెంబ్లీ, 17 ఎంపీ నియోజకవర్గాల్లో రథయాత్రలతో పాటు 106 సమావేశాలు, 102 రోడ్ షోలు నిర్వహించనున్నట్లు తెలిపారు.కాగా,వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని గత కొన్ని రోజులుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. పొత్తు వార్తలపై ఇదివరకే క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి.. ఇవాళ మరోసారి బీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని మరోసారి తేల్చి చెప్పారు.