దేశవ్యాప్తంగా సోమవారం నుంచి 3వ విడత లాక్‌డౌన్ అమలుకానున్న నేపథ్యంలో కేంద్రం పలు ఆంక్షలను సడలించింది. అందులో భాగంగానే గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సామాజిక దూరం పాటిస్తూ.. మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చని రాష్ట్రాలకు అనుమతులు ఇచ్చింది. దీంతో అనేక రాష్ట్రాల్లో సోమవారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అయితే తెలంగాణలో మాత్రం లాక్‌డౌన్ మే 7వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఆ తరువాతే మద్యం విక్రయాలు రాష్ట్రంలో ప్రారంభమవుతాయని తెలిసింది.
ఇక తెలంగాణలో మద్యం తయారీకి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బ్రూవరీలకు అనుమతినిచ్చింది. దీంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని 6 బ్రూవరీలు మళ్లీ మద్యం తయారీని ప్రారంభించనున్నాయి. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీర్లు స్టాక్ ఉన్నాయని, వాటి కాలపరిమితి కేవలం 6 నెలలే కనుక.. ఆ స్టాక్‌ను వెంటనే క్లియర్ చేయాల్సి ఉంటుందని లేకపోతే తమకు పెద్ద ఎత్తున నష్టం వస్తుందని మద్యం షాపుల యజమానులు అంటున్నారు. అలాగే బ్రూవరీలలో ఉన్న బీర్లను కూడా ఈస్ట్‌ను కలిపి రిఫైన్ చేయాలని, లేదంటే స్టాక్ అంతా చెడిపోతుందని బ్రూవరీల యజమానులు అంటున్నారు. అలా జరిగితే రూ.90 కోట్ల వరకు తమకు నష్టం వస్తుందని వారంటున్నారు. కనుక తమకు బీర్ల తయారీకి అనుమతివ్వాలని వారు కోరగా.. తెలంగాణ ప్రభుత్వం అందుకు ఓకే చెప్పింది. దీంతో సోమవారం నుంచి రాష్ట్రంలో బ్రూవరీలు బీర్ల తయారీని ప్రారంభించనున్నాయి.
కాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెలా 34 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతాయి. మరో 29 లక్షల మద్యం అమ్ముడవుతుంది. దీంతో ప్రభుత్వానికి నెలకు రూ.2వేల కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అయితే ఏప్రిల్ నెలలో పూర్తిగా లాక్‌డౌన్ ఉండడంతో ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. అయితే కేంద్రం సూచించిన నిబంధనల ప్రకారం మద్యం షాపులను గ్రీన్, ఆరెంజ్ జోన్లలో తెరిస్తే.. ప్రభుత్వానికి కనీసం నెలకు రూ.700 కోట్ల ఆదాయం అయినా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక మే నెలలో తెలంగాణలో 60 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతాయి. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణలో వేసవిలో బీర్ల విక్రయాలు జరుగుతాయి. దీంతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. అయితే మద్యం అమ్మకాలపై మే 5వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తరువాతే ఈ విషయంపై స్పష్టత రానుంది..!