రాష్ట్రంలోని సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఈసారి కార్పొరేట్ పాఠశాలలను తలపించేలా కొత్త డిజైన్లతో యూనిఫామ్ అందించాలని నిర్ణయించింది. తరగతుల వారీగా మొత్తం అయిదు రకాల డిజైన్లను ఖరారు చేశారు. ఎనిమిది నుంచి ఆపై తరగతుల అబ్బాయిలకు ప్యాంట్లు, కింది తరగతుల వారికి నిక్కర్లు ఉంటాయి.
మొత్తం 26 వేల పాఠశాలల్లోని 25 లక్షల మందికి వాటిని అందించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.145 కోట్లు ఖర్చు చేయనున్నారు. 1-8 తరగతుల విద్యార్థులకయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ఖర్చును భరిస్తాయి.
తొమ్మిది, పది తరగతుల వారితోపాటు కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో 12వ తరగతి వరకు విద్యార్థులకు కూడా పూర్తిగా రాష్ట్ర నిధులతో ఇస్తారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికే వాటిని విద్యార్థులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.