తెలంగాణ సర్కార్ పై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి ఫైర్ అయ్యారు. పెండింగ్ లో 7 బిల్లులు ఉన్నాయని.. రాజ్ భవన్ కు వచ్చి వాటిపై చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
తెలంగాణ శాసనసభ, మండలి ఇటీవల ఆమోదించిన 7 బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. అందులో కీలకమైన విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లు ఒకటి. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు, విశ్వవిద్యాలయాల్లోనూ అధ్యాపకుల భర్తీని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా బిల్లును ప్రవేశపెట్టి శాసనసభ, మండలిలో ఆమోదించింది. ఇప్పటివరకు గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు వీలు లేకుండా పోయింది. ఇటీవల విద్యార్థి సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లు ఆమోదంపై ఒత్తిడి వస్తోంది. రెండు రోజుల్లో బిల్లు ఆమోదించకపోతే రాజ్ భవన్ ముట్టడిస్తామని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీకి లేఖ రాశారు.
ఈ బిల్లు ఆమోదించడం ద్వారా ఏమన్నా న్యాయపరమైన సమస్యలు వస్తాయా? అలా జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. యూజీసీకి సైతం లేఖ రాసిన తమిళిసై.. బిల్లుపై అభిప్రాయాన్ని కోరారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి రాజ్‌భవన్ వచ్చి బిల్లుపై చర్చించాలని తమిళిసై సూచించారు.