తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష నేడు జరగనుంది. పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ పరీక్ష ఈ రోజు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. భారీ బందోబస్తు.. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది. అయితే.. పరీక్ష 10.30 నిమిషాలకు ప్రారంభం కానుండగా.. 08.30 గంటల నుంచే ఎగ్జామ్ సెంటర్లలోకి అభ్యర్థులను అనుమతించనున్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలను సేకరించనున్న నేపథ్యంలో 08.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు. అయితే.. పరీక్షకు 15 నిమిషాల ముందే అంటే 10.15 గంటలకే పరీక్షా కేంద్రాల గేట్లు మూయనునన్నట్లు బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది. సమయం ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.
503 పోస్టుల భర్తీ కోసం ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రశ్నపత్రం ఓపెన్ చేయగానే అందులో 150 ప్రశ్నలూ ముద్రించారో లేదో చూసుకోవాలని, ఏవైనా పొరపాట్లు ఉంటే ఇన్విజిలేటర్లను అడిగి ఇంకో ప్రశ్నాపత్రం తీసుకోవాలని అభ్యర్థులకు సూచించారు అధికారులు. ఓఎంఆర్ షీట్లో సూచించిన చోట కాకుండా ఎక్కడైనా హాల్‌టికెట్ నంబరు రాసినా, ఇతర గుర్తులు వేసినా చెల్లనిదిగా పరిగణిస్తామని పేర్కొన్నారు అధికారులు. క్వశ్చన్ పేపర్ పై ఎలాంటి రాతలు ఉండకూడదని స్పష్టం చేశారు అధికారులు. పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను డిజిటల్ ఓఎంఆర్ కాపీలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది టీఎస్‌పీఎస్సీ. అభ్యర్థులు పరీక్ష సమయంలో బయోమెట్రిక్ నమోదు చేయాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీచేసిన ఏదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకురావాలని అభ్యర్థులకు వివరించింది టీఎస్‌పీఎస్సీ. అయితే.. గతంలో ఈ సారి బహుళ సిరీస్‌ల ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
ఓఎంఆర్ షీట్‌లో జవాబులను బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో మాత్రమే బబ్లింగ్ చేయాలని సూచించారు. ఓఎంఆర్ షీట్‌లో 150 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంతో పాటు అభ్యర్థి పేరు ఇంగ్లిష్ క్యాపిటల్ లెటర్స్‌లో రాయాల్సి ఉంటుంది. డబుల్ బబ్లింగ్, చాక్‌పౌడర్, రబ్బరు వాడి జవాబును చెరిపిన, తప్పుగా వివరాలు పేర్కొన్న జవాబు పత్రాలను పరిగణలోకి తీసుకోరు. కాగా.. తెలంగాణ తొలి గ్రూప్ -1 పరీక్షకు 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే శనివారం అర్ధరాత్రి వరకు 3.41 లక్షల మంది మాత్రమే వెబ్ సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. మేడ్చల్ జిల్లాలో 51,931 మంది, ములుగు జిల్లా నుంచి 1,933 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.