తెలంగాణలో గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. జులై 1న రాతపరీక్ష జరగనున్న ఈ పోస్టుల కోసం చివరి రోజైన శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు 9,51,321 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్-4 సర్వీసుల కింద రాష్ట్రంలో ఈ సారి 8,180 పోస్టులు భర్తీ చేయనుండగా.. ఒక్కోపోస్టుకు సగటున 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి.
2018లో 700 వీఆర్‌వో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షకు రికార్డుస్థాయిలో 10.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో పోస్టులు తక్కువగా ఉండటంతో ఒక్కో పోస్టుకు సగటున 1511 మంది పోటీపడ్డారు. ఈ సంవత్సరం 8,180 గ్రూప్-4 పోస్టులకు 9,51,321 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం.