బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఆయన కుమారుడు పృథ్వీ తేజలకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌తో పాటు వీళ్లిద్దరిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసు విచారణపై యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈడీ నమోదుచేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఎంపీ నాగేశ్వరరావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌లపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు.
మధుకాన్ సంస్థకు చెందిన అనుబంధ కంపెనీ రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ బ్యాంకుల నుంచి రూ.360 కోట్ల రుణాలను పొంది నిధులను పక్కదారి పట్టించినట్లు సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు విచారణ చేపట్టింది. రూ.100 కోట్లకు పైగా ఆస్తులను జప్తు చేసింది.
నామా నాగేశ్వరరావు తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఝార్ఖండ్‌లో సీబీఐ నమోదు చేసిన కేసులో నామా నాగేశ్వరరావు, ఆయన కుమారుడిని నిందితుడిగా పేర్కొనలేదన్నారు. మదన్‌లాల్ చౌదరి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రధాన కేసులో నిందితులుగా లేనివారిపై ఈడీ కేసు కొనసాగించడానికి వీల్లేదన్నారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించడానికి వస్తున్నారని, గడువు కావాలని న్యాయవాది కోరడంతో విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేస్తూ, కేసుపై యథాతథస్థితిని కొనసాగించాలని ప్రధాన న్యాయమూర్తి ఆదేశించారు.