తెలంగాణలోని మావోయిస్టు సభ్యులు మొత్తం లొంగిపోవాలని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. కర్రెగుట్టలో ఎలాంటి ప్రత్యేక ఆపరేషన్స్ జరగలేదని ఆయన స్పష్టం చేస్తూ, కేంద్ర బలగాల నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు. వెంకటాపురం ప్రాంతంలో కేంద్ర బలగాలు తమ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి, ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో మావోయిస్టుల కదలికలు లేవని, శాంతి చర్చలు కూడా ప్రభుత్వం నిర్ణయించనుంది అన్నారు.
మావోయిస్టులు లొంగిపోతే వారికి పారితోషకం, రివార్డులు వెంటనే అందిస్తామన్న ఆయన, ఉపాధి కల్పించే వాగ్దానాన్ని కూడా ఇచ్చారు. ఇప్పటివరకు 252మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు ఐజీ వెల్లడించారు. తెలంగాణలో మావోయిస్టుల ప్రవేశం నియంత్రించేందుకు భద్రతా బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు. ఛత్తీస్ఘడ్ రాష్ట్రం నుంచి ఎక్కువమంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. వారి అనారోగ్య పరిస్థితులు తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. లొంగిపోయే మావోయిస్టులకు అన్ని రకాలుగా సహాయం చేయడానికి ప్రభుత్వ భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయని ఐజీ తెలిపారు.