తెలంగాణ పూర్తిగా కల్వకుంట్ల కుటుంబం చెప్పుచేతల్లో ఉందని.. రాష్ట్ర విముక్తి కోసం మునుగోడులో బిజెపిని గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభలొ చేసిన ప్రసంగంపై మాట్లాడుతూ.. మీ పరిపాలనలో ఎక్కడైనా నైతికత ఉందా? అని ప్రశ్నించారు.
మునుగోడులో రోడ్లు, పాఠశాల భవనాలు చిన్నచిన్న విషయాలు అంటున్నారు.. కానీ ప్రజలు ఆ చిన్న చిన్న విషయాలని అడుగుతున్నారని తెలిపారు. ఈ తొమ్మిది సంవత్సరాలుగా అసెంబ్లీ గురించి ఆలోచించారు తప్ప.. తెలంగాణలో మౌలిక సదుపాయాల గురించి ఏనాడు ఆలోచించలేదని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి ఒకరికి సాయం చేస్తారే తప్ప ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోలేదన్నారు.
పార్టీ ఫిరాయింపుదారుల్ని ముందు పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కెసిఆర్ తాకట్టు పెట్టారని.. తెలంగాణ ద్రోహులని పార్టీలోకి చేర్చుకునే సంస్కృతి టీఆర్ఎస్ కే ఉందని విమర్శించారు. నిన్నటి బహిరంగ సభలో నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఎమ్మెల్యేలు వేరే పార్టీ గుర్తుపై గెలిస్తే.. వారి గురించి చెబుతూ ఆత్మగౌరవం అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. టిఆర్ఎస్ పార్టీ గెలిస్తే అవినీతి, కుటుంబ పాలనను సమర్ధించిన వాళ్ళం అవుతామని అన్నారు.