తెలంగాణ సీఎం కేసీఆర్ కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఒక వైపు చూస్తే టిఆర్ఎస్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతుండటం, అదే సమయంలో బలమైన రాజకీయ పార్టీగా తెలంగాణలో సత్తా చాటుకునేందుకు బిజెపి వేగంగా అడుగులు వేసుకుంటూ, తమకి సవాల్ విసిరే స్థాయికి వెళ్లడం, మరోవైపు చూస్తే త్వరలోనే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలనే దానిపై కేసీఆర్ దృష్టిపెట్టారు. గతంలో ఎప్పుడూ ఎవరినీ లెక్క చేయనట్లుగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు, అన్ని మార్గాలను వెతుక్కునే పనిలో ఉన్నారు. రాబోయే జమిలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వేగంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా, తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనేది కెసిఆర్ కు ఉన్న కోరిక. దీని కోసం ఎప్పటి నుంచో కసరత్తులు చేస్తున్నా, ఎప్పుడూ ఏదో ఒక అడ్డంకి వస్తుండడంతో ఎప్పటికప్పుడు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. 2022లో జమిలి ఎన్నికలు వస్తే, ఆ తర్వాత పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో చెప్పలేం కాబట్టి, ముందుగానే కేటీఆర్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం పీఠంపై కేటీఆర్ ను కూర్చోబెట్టి తన కోరిక తీర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేటీఆర్ సైతం ఆ బాధ్యతలు చేపట్టేందుకు తహతహలాడుతున్నారు.
ఆ బాధ్యతలు ఆయనకు అప్పగించి పార్టీని మరింత బలోపేతం చేసే విషయంపై తాను దృష్టి పెడితే, 2022లో ఎన్నికలు వచ్చినా టిఆర్ఎస్ కు తిరుగులేకుండా చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కేసీఆర్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు కేటీఆర్ కు పట్టాభిషేకం చేయడం ఒక్కటే కేసీఆర్ కు ఉన్న అతి పెద్ద సవాల్ గా కనిపిస్తోంది.