ప్రస్తుతం ఏపీ రాజకీయాలను జంపింగ్ పాలిటిక్స్ కుదిపేస్తున్నాయి. టీడీపీ నుంచి కీలక నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అయితే విపక్ష టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు అధికార వైసీపీ ఎంపీలు కూడా తమతో టచ్లో ఉన్నారని బాంబు పేల్చింది. దీనిపై బీజేపీ వర్సెస్ వైసీపీ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఇక ఇప్పుడు తెలంగాణలోనూ అధికార టీఆర్ఎస్‌కు చెందిన ఓ ఎంపీ కూడా పక్క చూపులు చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ధర్మపురి అర్వింద్.. ఇప్పుడు ఈ పేరు తెలియని వారుండరు. బీజేపీలో ఆయనొక సంచలనం.. ఏది మాట్లాడిన సూటిగా సుత్తిలేకుండా ఉంటుంది. తండ్రి డీ శ్రీనివాస్ కాంగ్రెస్ కీలక నేతగా ఉన్నా, ఆ తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరినా.. అర్వింద్ మాత్రం తాను నమ్మిక బీజేపీలోనే కొనసాగారు. ఈ క్రమంలోనే గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.
తాజాగా అరవింద్ ఆసక్తికరమైర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ అసంతృప్త నేత, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌పై, ఆ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదని, అందులో మా నాన్న డీ శ్రీనివాస్ కూడా ఉన్నారని అర్వింద్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నుంచి ఆయన బటయకు వచ్చినందుకు ఎంతో సంతోషించానని, ఇప్పుడు అధికార టీఆర్ఎస్‌లో కూడా సంతృప్తిగా లేరని అర్వింద్ చెప్పుకొచ్చారు. ఆయనను ఏ కార్యక్రమానికి కూడా పిలవడం లేదని, ఒకవేళ పిలిచినా వెళ్లే అవకాశం అంతకన్నా లేదని అన్నారు.
టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి, బీజేపీలో చేరితే ఆయన కెరీర్‌లో ఒక మంచిపని చేసినవారిగా మిగులుతారని అర్వింద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి డీఎస్‌ను పొమ్మన కుండా పొగ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది ఓపెన్ సీక్రెట్.
ఈ క్రమంలోనే డీఎస్ టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లడం ఖాయమన్న చర్చలు గత రెండు రోజులుగా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే డీఎస్ పార్టీ మార్పుకు సరైన టైంను.. సరైన వేదికను వాడుకోవాలని బీజేపీ చూస్తోంది. అదే టైంలో టీఆర్ఎస్‌కే చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం తమతో టచ్లో ఉన్నారని కూడా అర్వింద్ చెప్పారు. అంటే ఏపీ, తెలంగాణలో రెండు చోట్లా కూడా బీజేపీ అధికార పార్టీ నేతలపై మైండ్ గేమ్ ఆడుతోందన్నది స్పష్టంగా తెలుస్తోంది.