తెలంగాణ రాష్ట్రం 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులకు ప్రతిపాదన చేసింది. ఈ విషయం నిన్న కేంద్ర పౌరవిమానయానశాఖ సహాయమంత్రి వీకేసింగ్ తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చాడు. తెలంగాణలో పలు జిల్లాల్లో ఎయిర్ పోర్ట్ లను ఏర్పాటు చేయాలన ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రణాళికలు రూపొందించింది. వీటిలో 1. నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, 2. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ, 3. మహబూబ్‌నగర్‌లో , 4. వరంగల్ జిల్లా మామ్‌నూరు, 5. పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, 6. ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ పూర్తిచేసి రిపోర్ట్ను తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్లు తెలిపారు. అయితే వీటి నిర్మాణం అనుమతులు, భూసేకరణ, బిడ్డింగ్ ప్రక్రియపై ఆధారపడి ఉందని మంత్రి తెలిపారు.
మరోవైపు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ విస్తరణ ప్రక్రియ పనులు జరుగుతున్నాయని.. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతుందని పౌరవిమానయానశాఖ సహాయ మంత్రి జనరల్ వీకేసింగ్ తెలిపారు. విస్తరణ పూర్తయ్యాక విమానాశ్రయ ప్రయాణికుల సామర్థ్యం ఏడాదికి 1.2 కోట్ల స్థాయి నుంచి 3.4 కోట్లకు చేరుతుందన్నారు.