కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించి కఠినంగా అమలు చేస్తున్నారు. మొదటి వేవ్‌లో మాదిరిగా కాకుండా ఇప్పుడు ఫ్రెండ్లీ పోలిసింగ్‌తో ప్రజల పట్ల కర్కశంగా వ్యవహరించకుండా నిదానంగా సర్ది చెప్పి పంపిస్తున్నారు. భేష్.. అని తెలంగాణ హైకోర్టు మెచ్చుకుని కొన్ని రోజులు కూడా కాకముందే పోలీసులు మళ్లీ తమ లాఠీలకు పనిచెప్పారు. రహదారులపై దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. కోవిడ్ రోగులకు భోజనం తీసుకెళ్తున్నామని కొందరు, ఫుడ్ డెలివరీ యాప్‌లకు చెందిన డెలివరీ బాయ్స్ కొందరు, మీడియా.. ఇలా అత్యవసర సేవలు అందించే వారిని కూడా విడిచిపెట్టకుండా చావబాదారు. పోలీసులు మళ్లీ యథావిధిగా తమ నైజం నిరూపించుకున్నారు.
అయితే పోలీసులు ఇలా ప్రవర్తించేందుకు కారణం లేకపోలేదు. గత కొద్ది రోజులుగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నా జనాలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వస్తున్నారని, కరోనా నిబంధనలను పాటించడం లేదని న్యూస్ చానల్స్, పత్రికలు ఊదరగొట్టాయి. దీంతో సహజంగానే సీఎం కేసీఆర్ మరింత కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ఆదేశించారు. కానీ జనాలను చావబాదమని ఆయన చెప్పలేదు. అయితే దాన్ని పోలీసులు మాత్రం వేరేగా అర్థం చేసుకున్నారు. మీడియా చూపించిన అతితో పోలీసులు మరింత అత్యుత్సాహం ప్రదర్శించారు.
అవసరం లేని వారు బయటకు వస్తే నిజంగానే చావ బాదాల్సిన అవసరం ఉందా ? వాహనాలు తీసుకుని సీజ్ చేస్తున్నారు కదా, అది సరిపోదా ? మళ్లీ కొట్టడం, తన్నడం ఎందుకు ? సరే వారు నిబంధనలను అతిక్రమించారు. కానీ అందుకు చట్ట ప్రకారం ముందుకెళ్లాలి. ఇలా పాశవికతను ప్రదర్శించకూడదు. ఇక నిజంగానే అవసరం ఉండి బయటకు వచ్చిన వారిని కూడా పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వైద్య సేవలు పొందే వారికి సహాయంగా ఉండేవారు, మీడియా, ఫుడ్ డెలివరీ యాప్ సిబ్బంది వంటి వారిపై ప్రతాపం చూపించారు. హైకోర్టు భేష్ అని మెచ్చుకున్న రెండు, మూడు రోజుల్లోనే పోలీసుల వైఖరి యూ టర్న్ తీసుకుంది. దీంతో జనాలు ఇబ్బందులు పడక తప్పడం లేదు. అనవసరంగా బయటకు వచ్చే వారిని శిక్షించడం ఎంత ముఖ్యమో నిజంగా అవసరం ఉండి బయటకు వచ్చే వారిని వారి అవసరాలు తీరేట్లు వారికి సహాయం చేయాల్సిన బాధ్యత మీడియా, పోలీసులపై ఉంది. అది గుర్తించకుండా వారిపై కూడా చర్యలు తీసుకోవడం దారుణం. ఇకనైనా ఆ రెండు రంగాలు అత్యుత్సాహం ప్రదర్శించకుండా క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో, జనాలు ఎలా అవస్థలు పడుతున్నారో తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిది. లేదంటే ఇప్పటికే దిగజారిపోయిన మీడియా, పోలీసుల పరువు ఇంకా పాతాళానికి పడిపోతుంది.