ఈ ఏడాది తెలంగాణా రాజకీయాల్లో సంచలనాలు జరిగే అవకాశం ఉందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. తెరాస, కాంగ్రెస్ పార్టీల్లో ఈ సంచలనాలు జరిగే అవకాశం ఉందనే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. కీలక మార్పులు ఈ రెండు పార్టీల్లో జరుగుతాయని అవి రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు పరిశీలకులు. ఇన్నాళ్ళు సప్పగా సాగిన రాజకీయాలు ఇప్పుడు కాస్త ఘాటుగా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
తెరాస లో కేటిఆర్ ముఖ్యమంత్రి అవడం ఈ ఏడాదే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఆయన సూపర్ సిఎం గా ఉంటూ ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉంటారని అంటున్నారు. కేటిఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశాలు ఉన్నాయని పత్రికల్లో కూడా వార్తలు వస్తున్నాయి. ఇది ఈ ఏడాది జరగడం ఖాయమనే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి.
ఇక అది పక్కన పెడితే కాంగ్రెస్ నుంచి కూడా ఒక సంచలనం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. రేవంత్ రెడ్డికి పూర్తి బాధ్యతలు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించే యోచనలో ఉందనే చర్చలు జరుగుతున్నాయి. అందుకే ఉత్తమ కుమార్ రెడ్డి అద్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే ప్రకటన చేసారని అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సీనియర్లను పక్కన పెట్టి యువకులకు అవకాశం ఇచ్చే యోచనలో ఉందని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇవి జరిగే అవకాశం ఉందని, ఆ మేరకు రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయని అందుకే కేటిఆర్ తమ ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారని అంటున్నారు.