అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. అంగన్ వాడీలకు జులై నుంచి పెంచిన వేతనాలను డిసెంబర్ జీతంతో కలిపి ఖాతాల్లోజమ చేస్తున్నామని.. రాష్ట్ర గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. శుక్రవారం ఆమె ఈ వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల వేతనాలను 2018 సెప్టెంబర్ లో ఒకసారే పెంచిందని చెప్పారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ వారి వేతనాలను మూడు సార్లు పెంచారన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. 2021 సెప్టెంబర్ జీవో నెంబర్ 47 ద్వారా అంగన్ వాడీ టీచర్ల వేతనాలను రూ. 10,500 నుంచి 13,650 కు… హెల్పర్లు, మినీ అంగన్వాడీ టీజర్ల వేతనాలను రూ.6 వేల నుంచి రూ. 7800 కు పెంచిందని వివరించారు. జూలై నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయని.. ఈ నెల నుంచి ఖాతాల్లోకి పెంచిన వేతనాలు పడనున్నట్లు వివరించారు మంత్రి సత్యవతి రాథోడ్.